తెలుగుదేశం పార్టీ నేతలపై వరుసగా జరుగుతున్న ఐటీ దాడులను.. ఆపరేషన్ గరడులో భాగంగానే ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు.. తెలుగుదేశం పార్టీ నేతలంతా.. మూకుమ్మడిగా… కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు,మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావులతో ప్రారంభించి.. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా… తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉన్న కొంత మంది పారిశ్రామిత్తలపై కూడా.. ఇటీవలి కాలంలో.. ఐటీ దాడులు జరిగాయి. సుజనా చౌదరిపై ఈడీ దాడులు జరిగాయి. ఇప్పుడు నేరుగా… ఎంపీ సీఎం రమేష్ ఇంటిపై… వంద మందికిపైగా అధికారులతో దాడులు చేయడాన్ని ఖచ్చితంగా రాజకీయ కుట్రగానే.. టీడీపీ భావిస్తోంది. ఈ మేరకు.. కేంద్రప్రభుత్వంపై రివర్స్ ఎటాక్ ప్రారంభించింది. మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
ఆపరేషన్ గరుడలో భాగంగానే తెదేపా నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా కేంద్రంపై మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని నిలదీసినందుకే మోదీ ఆంధ్రప్రదేశ్‌పై కక్ష గట్టారని ఆరోపించారు. మొన్న బీద మస్తాన్‌రావు, నిన్న సుజనాచౌదరి, నేడు సీఎం రమేశ్‌పై ఐటీ దాడులు చేయడం దీనిలో భాగమేనన్నారు. కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్నందుకే రమేశ్‌ను లక్ష్యం చేసుకున్నారని లోకేశ్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు రాకుండా చేయాలని దురుద్దేశంతోనే రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలపై మోడీ దాడులు చేయిస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా విభజన హామీల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
నిజానికి.. కచ్చితంగా… ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణదీక్ష చేసి.. వంద రోజులయిన సందర్భంగా.. మరోసారి ఉక్కుమంత్రిని కలిసేందుకు టీడీపీ ఎంపీలందరూ ఢిల్లీకి చేరుకున్న సమయంలో… ఐటీ దాడులు జరగడంతో.. దీన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు.. తెలుగుదేశం పార్టీ నేతలు.. చాలా ప్లాన్డ్ గా వ్యవహరిస్తున్నారు. ముందుగా లోకేష్ ట్వీట్ చేశారు. ఆ తర్వతా సీఎం రమేష్ నేరుగా ప్రెస్ మీట్ పెట్టి.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా… కేంద్రంపై, మోడీపై విరుచుకుపడ్డారు. ఐటీ దాడుల వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందన్నది స్పష్టంగా తెలుస్తోందని… ఐటీ శాఖను అడ్డం పెట్టుకుని వేధించాలని చూస్తోందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడేది లేదన్నారు. మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎంపీ కనకమేడల రవీంద్రకుమర్ సహా అనేక మంది… మీడియా సమావేశాలు పెట్టి.. రాజకీయంగా జరుగుతున్న దాడులను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఐటీ దాడుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో కానీ.. రాజకీయంగా మాత్రం… ఏపీలో…. టీడీపీ వర్సెస్ బీజేపీ, వైసీపీ, జనసేన అన్నట్లుగా మారిపోయింది.