“ఆఫీసర్” సినిమాతో తనపై పిచ్చి ఫ్యాన్స్ పెట్టుకున్న చిట్టచివరి ఆశను కూడా… అడియాశను చేసిన రామ్ గోపాల్ వర్మను ఇప్పుడు పట్టించుకునేవారు లేరు. గతంలో.. ఆయన ఏదైనా ట్వీట్ చేస్తే.. స్పందించేవారు. ఇప్పుడు ఎవరూ పట్టించురకోవడం లేదు కానీ.. అంతో ఇంతో మళ్లీ రచ్చ చేయివచ్చనుకుంటున్న ప్రాజెక్ట్ .. “లక్ష్మీస్ ఎన్టీఆర్” ను మళ్లీ తెరిపైకి తీసుకు వస్తున్నారు. పందొమ్మిదో తేదీనే తిరుపతిలో ముహుర్తం షాట్ జరుపుకోనున్నట్లు ప్రకటించారు. జీవీ ఫిలిమ్స్ బ్యానర్ సమర్పణలో రాకేష్ రెడ్డి నిర్మాణంలో రూపొందించనున్నామని, ఈ విజయదశమికి సినిమా స్టార్ట్ చేసి జనవరి చివరికల్లా సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తామని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్, లక్ష్మిపార్వతి, చంద్రబాబు నాయుడు లతో కూడిన ఫోటోలను ట్వీట్ చేశారు.
నిజానికి ఆఫీసర్ సినిమా ప్రారంభానికి ముందు “లక్ష్మీస్ ఎన్టీఆర్” పేరుతో ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. చాలా రోజులు మీడియాలో చర్చోపచర్చలు జరిగేలా వివాదాస్పద ప్రకటనలు చేశారు. స్పందించిన టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. వివాదాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోయారు. కొత్త నటీనటుల్ని తీసుకుని ట్రైనింగ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. తర్వతా సైలెంటయిపోయారు. మధ్యలో రాకేష్ రెడ్డి అనే ప్రొడ్యూసర్ ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్యూలో ఏదో వాగారాని.. దానిని తాను ఖండిస్తున్నానని… తను ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా… సీన్ లోకి వచ్చారు. ఎన్నికల వేడి పెరుగుతూండటంతో.. తన సినిమాకు ఇదే మంచి తరుణం అనుకుంటున్నారేమో..?
అయితే ఇప్పుడు ఆర్జీవీ దగ్గర గుజ్జు ఏమీ మిగలలేదని… ఇటీవల ఆయన సినిమాలతోనే తేలిపోయింది. అందుకే ఇప్పుడు ఎవరూ ఈ సినిమా గురించి పట్టించుకోక పోవచ్చు కూడా. కానీ ఆర్జీవీ మాత్రం… తన సినిమాకు హైప్ రావడానికి తనదైన విన్యాసాలు చేసే అవకాశం అయితే చాలా ఉంది.