గతంలో తెనాలి ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరాడు. ఇప్పటిదాకా జనసేన లో చేరిన నాయకులతో పోలిస్తే, మనోహర్ చేరిక చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈయన గతంలో స్పీకర్ పదవిని నిర్వహించి ఉండడంవల్ల, ఆ స్థాయి వ్యక్తి జనసేన పార్టీలో చేరడం ఆ పార్టీ అభిమానులకు మాత్రం బాగానే ఆనందాన్నిచ్చింది. అయితే తెనాలి అసెంబ్లీ సీటు కు, సీఎం పీఠానికి మధ్య ఉన్న సెంటిమెంట్ ఇప్పుడు చాలామంది కి ఆసక్తి కలిగిస్తోంది.
ఉదాహరణకి 1983 నుంచి 85 దాకా తెనాలి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీకి చెందిన అన్నాబత్తుని సత్యనారాయణ ఉంటే ఆ సమయంలో, ముఖ్యమంత్రి పదవిలో కూడా అదే పార్టీకి చెందిన ఎన్టీఆర్ ఉన్నారు. అలాగే 1985 లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో కూడా ఇదే సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించగా, రాష్ట్రం లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే 19 89 లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నాదెండ్ల భాస్కరరావు విజయం సాధిస్తే, రాష్ట్ర మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుని సీఎం పీఠం కాంగ్రెస్ పార్టీ సొంతమైంది. 1994 లో తెలుగుదేశం పార్టీకి చెందిన రవీంద్రనాథ్ విజయం సాధిస్తే, ముఖ్యమంత్రి పీఠం కూడా తెలుగుదేశం పార్టీకే కైవసం అయింది. ఇక 1999 నుంచి 2004 మధ్యలో, తెలుగుదేశం పార్టీకి చెందిన గోగినేని ఉమ గెలవడం, అదే పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం జరిగిపోయింది. ఇక 2004లోనూ, ఆ తర్వాత 2009లోనూ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ విజయం సాధించగా, ముఖ్యమంత్రి పీఠంపై కూడా అదే పార్టీకి చెందిన అభ్యర్థులు ఉన్నారు. ఇక 2014లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఈ స్థానం నుంచి గెలుపొందారు.
ఈసారి జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ ఈ ప్రాంతం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే 1983 నుంచి ఈ సెంటిమెంట్ ఇప్పటిదాకా ఎక్కడా బ్రేక్ అవకుండా కొనసాగుతోంది. మరి ఇదే సెంటిమెంట్ 2019లో కూడా పునరావృతమవుతోందా అన్నది వేచి చూడాలి.