మీటూ ఉద్యమం చిత్రసీమని కుదిపేస్తోంది. బాలీవుడ్ అయితే ట్వీటు ట్వీటుకీ ఉలిక్కిపడుతోంది. బాలీవుడ్‌లో కథానాయకులంతా మీటూకి మద్దతు తెలిపారు. అక్షయ్ కుమార్ షూటింగులను క్యాన్సిల్ చేసి సంచనల నిర్ణయం తీసుకున్నాడు. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లు కూడా మీటూపై స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆయన ట్వీట్లపై కూడా కౌంటర్లు కూడా పడ్డాయి. అమితాబ్ స్పందన కంటే, ఆ స్పందనపై వచ్చిన కౌంటర్లే బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది గా మారాయి. అయితే ఈ ఉద్యమంపై ఇప్పటి వరకూ టాలీవుడ్ హీరోలెవరూ పెదవి విప్పలేదు. దానికీ కారణం ఉంది. ఏరి కోరి.. ఎందుకు రొంపిలోకి దిగడం అని. ఎవరు స్పందించినా కౌంటర్లు వేయడానికి శ్రీరెడ్డి లాంటి వాళ్లు రెడీగా ఉంటారు. అమితాబ్‌కి ఎదురైన పరిస్థితే మన హీరోలకూ ఎదురైనా ఆశ్చర్యపోనవసరం లేదు. సమంత, రకుల్, కాజల్.. వీళ్లంతా దక్షిణాది కథానాయికలే. ఆమాటకొస్తే.. వీళ్లే తెలుగు హీరోయిన్లు. వీళ్లంతా ట్వీట్ల ద్వారా `మీటూ` ఉద్యమానికి వత్తాసు పలుకుతుంటే.. వాళ్లతో కలసి నటించినవాళ్లంతా మిన్నకున్నారు. కనీసం నాగచైతన్య, నాగార్జున కూడా సమంతవైపు మాట్లాడలేకపోతున్నారు. దీనికంతా ఆత్మరక్షణ ధోరణే కారణం. తెలుగు చిత్రసీమలో కొంతమంది కథానాయికలు లైంగిక వేధింపులకు గురయ్యారన్నది నిజం. అందుకే సమంతలాంటివాళ్లు స్పందించారు. కానీ మన హీరోలకు ధైర్యం చాలడం లేదు. మరి మన హీరోల్లో తొలి అడుగు ఎవరేస్తారో చూడాలి.