మహాకూటమి సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇంకా ఒక కొలీక్కి రాలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో సీట్ల విషయమై కూటమి పక్షాల్లో టెన్షన్ పెరుగుతోంది. వీలైనంత త్వరగా తమ నంబర్ ఏంటో తేలిపోతే… తమ పనుల్లో తాము ఉండొచ్చు అనే అభిప్రాయంతో కూటమి పక్షాలున్నాయి. అయితే, ఈ ప్రక్రియ విషయమై కూటమి నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. శనివారం కూడా కూటమి నేతలు రహస్యంగా సమావేశమైనట్టు సమాచారం. హైదరాబాద్ లోని గండిపేటలో జరిగిన ఈ సమావేశంలో టి. టీడీపీ నేత ఎల్. రమణ, టీజేఎస్ అధినేత కోదండరామ్, సీపీఐ నేత చాడా వెంకట రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఒక ప్రముఖ నేత హాజరైనట్టు తెలుస్తోంది.
అయితే, సమావేశంలో సీట్ల సర్దుబాటు విషయమై కొంత స్పష్టత వచ్చిందనీ తెలుస్తోంది. టీడీపీ 15 సీట్ల కోసం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. కానీ, కాంగ్రెస్ మాత్రం 9 ఇచ్చేందుకే సిద్ధమన్నట్టు సమాచారం. సీపీఐ ఆరు కోరుతుంటే, వారికీ మూడే అంటోందట. టీజేయస్ దాదాపు 16 సీట్లు ఆశిస్తుంటే… అందులో సగం మాత్రమే కోదండరామ్ పార్టీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ నంబర్లపై మూడు పార్టీల నేతలూ సంతృప్తిగా లేరని అంటున్నారు. దీంతో చర్చల ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని నేతలు అంటున్నారు.
సీట్ల కుస్తీలో కూటమి పార్టీల వ్యూహం ఒకలా కనిపిస్తుంటే, కాంగ్రెస్ పట్టు మరోలా కనిపిస్తోంది! ఎలాగైనా దాదాపు వంద స్థానాల్లో సొంతంగా పోటీ చేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. అందుకే, భాగస్వామ్య పక్షాలకు 20 సీట్లు మాత్రమే ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్టుంది. పైగా, భాగస్వామ్య పక్షాలకు అత్యధిక స్థానాలు కేటాయిస్తే… రేప్పొద్దున వారిపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందనే విశ్లేషణలు కూడా ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. ఇక, మూడు పార్టీల వ్యూహం ఏంటంటే… వీలైనంతగా బేరసారాలు సాగించడం ద్వారా ఎక్కువ సీట్లు రాబట్టుకోవచ్చనేట్టుగా ఉంది. దీనికి ఉదాహరణ.. టీజేయస్. మొదట్లో ఆ పార్టీకి మూడు సీట్లే ఇస్తామన్నట్టుగా కాంగ్రెస్ అభిప్రాయపడుతూ వచ్చింది. కానీ, ఇప్పుడా పార్టీకి 8 సీట్లు కేటాయిస్తామనే వరకూ వచ్చింది. కాబట్టి, చివరి వరకూ ఈ చర్చల ప్రక్రియను సాగదీసేందుకే కాంగ్రెస్ తోపాటు, మిత్రపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తోంది.
ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తామంటున్న సీట్ల స్థానాలే చూస్తుంటే… ఒక్కో భాగస్వామ్య పక్షానికీ సింగిల్ డిజిట్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ వీటికే ఆయా పార్టీలు సంతృప్తి పడిపోతే… తెరాస నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఆ రెండో మూడో సీట్లు మేము ఇచ్చేవాళ్లం కదా, ఆ మాత్రం దానికి మహాకూటమి ఎందుకు అని కేసీఆర్ ప్రశ్నించడం పక్కా! టీజీఎస్ విషయంలో ఇప్పటికే ఆయన ఇలాంటి కామెంట్ చేసేశారు కూడా. మొత్తానికి, దసరా పండుగ దాటితే తప్ప… మహాకూటమి సీట్ల సర్దుబాట్లు ప్రక్రియ ఒక కొలీక్కి వచ్చేలా కనిపించడం లేదు.