కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నపళంగా ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. పెద్దగా పబ్లిసిటీ లేకుండా.. పారిస్ వెళ్లిన రక్షణ మంత్రి.. అక్కడ రాఫెల్ గురించిన వ్యవహారాలే చక్కబెడతున్నారు. దసో ఏవియేషన్‌ను సందర్శించారు. రాఫెల్ విమానాల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. దేశంలో రాఫెల్ స్కాం పై గగ్గోలు పెడుతున్న సమయంలో ఉన్న పళంగా.. ఆమె ఎందుకు ఫ్రాన్స్ వెళ్లాల్సి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొద్ది రోజులుగా ఫ్రాన్స్ నుంచి.. వరుసగా.. రాఫెల్ అనేది ఓ పెద్ద స్కాం అన్నట్లుగా.. సమాచారం బయటకు వస్తోంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ కంపెనీని తొలగించి ఆ స్థానంలో రియలన్స్ డిఫెన్స్‌ను చేర్చడానికి ప్రధాని స్థాయిలోనే గూడుపుఠాణి జరిగిందని… ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండె దగ్గర్నుంచి దసో ఏవియేషన్ ఉన్నతాధికారుల వరకూ…అందరూ చెబుతున్నారు. దీని కవరప్ చేయడానికే… అక్కడ్నుంచి ఇక ఎలాంటి.. ప్రకటనలు రాకుండా చేయడానికే.. నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇంత అత్యవసరంగా ఫ్రాన్స్ దేశానికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నను కాంగ్రెస్ వర్గాలు… పదే పదే వేస్తున్నాయి. ఈ కాంట్రాక్టును దసాల్ట్‌కు ఇవ్వడానికి రిలయెన్స్ డిఫెన్స్ సంస్థను భాగస్వామిగా తప్పనిసరిగా చేర్చుకోవాల్సివచ్చిందని ఆ కంపెనీ ప్రతినిధి లోయెక్ సెగలేన్ గతంలో చెప్పినట్టు ఫ్రాన్స్ మీడియాలోనే కథనాలు వచ్చాయి. కేవలం ఈ కాంట్రాక్టుకు 10 రోజులముందే అనిల్ అంబానీ రిలయెన్స్ డిఫెన్స్ సంస్థను ఏర్పాటు చేశారు. రాఫెల్ కాంట్రాక్టును దసాల్ట్ సంస్థకే అప్పగించడం ద్వారా ప్రధాని మోదీ రిలయెన్స్ సంస్థకు రూ. 30 వేలకోట్లు అప్పనంగా ధారబోశారని రాహుల్ సహా విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. రాఫెల్ డీల్‌లో అవినీతిని కప్పిపుచ్చేందుకే రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్‌కు వెళ్లారని రాహుల్ ఆరోపిస్తున్నారు.
రాఫెల్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. మొత్తం వివరాలన్నింటినీ సీల్డ్ కవర్లో ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. కేంద్రం.. ఉన్న పళంగా.. మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టుకునే పని చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కోణంలోనే.. రక్షణ మంత్రి ఫ్రాన్స్ పర్యటన ఉందని.. ఉహాగానాలు తలెత్తుతున్నాయి. దీనిపై..మోడీ సమాధానం ఇస్తారో.. ఎప్పటిలానే సైలెంట్‌గా ఉంటారో వేచి చూడాల్సిందే..!