రాష్ట్రంలో ఐటీ దాడుల పర్వం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ కి సంబంధించిన నాయకుల మీద, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న వ్యాపారవేత్తల మీద దాడులు జరుగుతున్నట్టు మీడియాలో వస్తున్న వార్తల ద్వారా స్పష్టం అవుతోంది. ఐటీ దాడుల ని మీడియా విశ్లేషిస్తున్న తీరుపై, పలు పార్టీలు స్పందిస్తున్న తీరు పై చర్చ జరుగుతోంది. అయితే రాజకీయాలు ఉన్న కాసేపు పక్కన పెడితే, తెలుగు ప్రజలు ఈ ఐటీ దాడులని ఏ విధంగా చూడాల్సి ఉంది – తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి అనుంగు మీడియా చెబుతున్నట్టు తెలుగు ప్రజలంతా ఈ దాడులను ముక్తకంఠంతో ఖండించాలా? లేక వీటిని సమర్థించాలా అన్న చర్చ నడుస్తోంది.
తెలుగుదేశం నాయకులు ఏమంటున్నారు:
నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ జరగబోతోందని, తెలుగుదేశం పార్టీ మూలాలను దెబ్బ కొట్టే ఉద్దేశంతో బిజెపి ఈ ఆపరేషన్‌కు తెరతీసిందని, ఇప్పుడు జరుగుతున్న ఐటీ దాడులు ఈ ఆపరేషన్‌లో భాగమేనని చెప్పుకొస్తున్నారు. అధికారికంగా ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు కానప్పటికీ, తెలుగు ప్రజలలో చాలా మంది ఈయన ని ఒక తటస్థుడి గా కంటే కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు గానే చూస్తున్నారు. ఇక మంత్రి లోకేష్ కూడా, 200 మంది ఉద్యోగులతో, 19 బృందాలుగా ఏర్పడి ఇంత పెద్ద ఎత్తున ఐటీ సోదాలు నిర్వహించడం ఇదే ప్రథమమని, ఇది తెలుగు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని వ్యాఖ్యానించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రలో భాగమే ఈ ఐటీ సోదాలు అంటూ కూడా వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజలంతా ఐటీ దాడులని ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ఇక సీఎం రమేష్ అయితే, తాను కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేసినందువల్ల కేంద్ర ప్రభుత్వం తన మీద కక్ష పెంచుకుని ఐటీ దాడులు చేస్తోందని వ్యాఖ్యానించారు.
విపక్షాలు ఏమంటున్నాయి:
వైఎస్ఆర్ సీపీ నేత జగన్, జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా ఈ దాడులపై స్పందించారు. తెలుగుదేశం పార్టీ నేతల పై జరిగే ఐటీ దాడులని తెలుగు ప్రజల పై జరుగుతున్న దాడి గా చూడాల్సిన అవసరం లేదన్నట్లు మాట్లాడిన జగన్, తన మీద ఐటీ దాడులు జరిగినప్పుడు ఇదే దేశం నేతలు, ఇదే తెలుగుదేశం అనుకూల మీడియా స్పందించిన తీరు ని గుర్తు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా, నిజంగా గతంలో అరవింద్ కేజ్రివాల్ ఇంట్లో సోదాలు జరిపినట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లో సోదాలు జరిపి ఉంటే, కచ్చితంగా తాను విమర్శించి ఉండేవాడినని, కానీ ఎవరో వ్యాపారవేత్తల పై జరిగిన ఐటీ దాడుల మీద విపక్ష నాయకులు స్పందించాలనడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఇక బిజెపి నాయకులైతే, కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. నిజంగా మీరు తప్పు చేయనట్లయితే దానికి ఇంతగా భయపడడం ఎందుకు , ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకు అంటూ వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు ఏమంటున్నారు :
ప్రజల్లో కూడా ఈ ఐటి దాడుల మీద, వాటిని మీడియా ప్రజెంట్ చేస్తున్న తీరు మీద మిశ్రమ స్పందన వస్తోంది. తప్పు చేయకపోతే ఐటీ దాడులకు భయపడాల్సిన అవసరమే లేదని కొందరంటున్నారు. ఒకవేళ కట్టాల్సిన పన్ను కంటే తక్కువ కట్టడం లాంటి పొరపాట్లు జరిగి ఉన్నా కూడా , వాటిని ఐటీ శాఖ ఇప్పుడు పట్టుకున్నా కూడా, అవి మరీ తీవ్రమైన నేరాలు కాదని, పెనాల్టీ తో సహా ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను కడితే సరిపోతుందని వారంటున్నారు. దానికి ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని, కేవలం మనీలాండరింగ్ లాంటి వ్యవహారాలకు మాత్రమే తీవ్రమైన శిక్షలు ఉంటాయని వారు గుర్తు చేస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం, ఈ సెలెక్టివ్ దాడులను ఖండిస్తున్నారు. దాడులు జరిగితే అన్ని పార్టీల మీద, అందరిమీద జరగాలని, రాజకీయ పార్టీలని తమ నియంత్రణలోకి తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి దాడులు చేయించరాదని వారంటున్నారు. అయితే ఇలా ప్రజలలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, తెలుగుదేశం నాయకులు చెబుతున్నట్టుగా ప్రజలు భయబ్రాంతులకు అయితే గురి కావడం లేదు. అలాగే ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అంశంగా కూడా దీన్ని పరిగణించడంలేదు. అలాగే ఎపి ప్రజల హక్కుల కోసం పోరాడినందుకే, కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తోందని కూడా ప్రజలు అనుకోవడం లేదు. ప్రజల దృష్టిలో ఇది ఒక రాజకీయ క్రీడ. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు చేర్చుకోవడం, కేంద్రంలో ఉన్న సోనియా గాంధీ జగన్ మీద కేసులు పెట్టడం, లాంటిదే ఈ రాజకీయ క్రీడ కూడా అని వారు భావిస్తున్నారు.
ఇది “బెస్ట్ ” ఆప్షన్ కాకపోవచ్చు కానీ, ప్రజల విషయంలో “బెటర్” ఆప్షనే:
ఇక్కడ మూడు పాజిబులిటీస్ ఉన్నాయి. మొదటిది, సి.బి.ఐ , ఈడి , ఐటి లాంటి సంస్థలన్నీ స్వతంత్రంగా, ఏ రాజకీయ పార్టీల ఒత్తిడికి లోనుకాకుండా, రాజకీయాలకు అతీతంగా పని చేయడం. ఇది బెస్ట్ ఆప్షన్. కానీ ప్రాక్టికల్‌గా ఇప్పుడప్పుడే ఇది సాధ్యమవుతుందని భావించడం అత్యాశే. ఎందుకంటే అలా జరగాలంటే వ్యవస్థలో సమూలమైన మార్పు జరగాల్సి ఉంటుంది. ఇక రెండవ ఆప్షన్, ఈ సంస్థలన్నీ , అధికార పార్టీ , ప్రతిపక్ష పార్టీ అన్న తారతమ్యం లేకుండా రాజకీయ పార్టీలను పూర్తిగా వదిలేసి, కేవలం మధ్యతరగతి ప్రజల మీద, రాజకీయాలకు సంబంధం లేని కార్పొరేట్ సంస్థల మీద, వ్యాపారాలు చేసుకుంటున్న వారి మీద మాత్రమే ఫోకస్ చేసి వారి మీద మాత్రమే దాడులు చేయడం. ఇది మూడింటిలో కి “వరస్ట్” ఆప్షన్. అన్ని రాజకీయ పార్టీల నాయకులు కుమ్మక్కయి వారిలో వారు సహకరించుకుంటూ, ప్రజలను మాత్రమే వేధించడం మంచి పద్ధతి కాదు. ఇక మూడవ ఆప్షన్ – ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పార్టీ మీద, ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ మీద ఇలాంటి దాడులు చేసి వారి హయాంలో జరిగిన అవినీతి ని బయటకు తీయడం. ఇది బెస్ట్ ఆప్షన్ కాకపోవచ్చు కానీ, రాజకీయ నాయకులందరూ కుమ్మక్కు అవడం తో పోలిస్తే కచ్చితంగా బెటర్ ఆప్షన్. నిజంగా దాడులకు గురైన వారు ఏ తప్పూ చేయకపోతే , ఏ అవినీతికి పాల్పడకపోతే, ఈ దాడుల వల్ల వారు నిజాయితీ మరొకసారి ప్రపంచానికి తెలుస్తోంది. అది వారికి మేలు చేస్తుంది. అలా కాకుండా ఏవైనా అవకతవకలు బయటపడితే ప్రజా సొమ్ము తిరిగి ప్రజలకు చేరే అవకాశం ఉంటుంది అది కూడా వ్యవస్థకు మంచిదే. అలాగే రాజకీయ నాయకులలో కూడా తాము ఎల్లకాలం అధికారంలో ఉండలేమని, అవినీతి చేస్తే అవతలి ప్రభుత్వం వచ్చాక తమ అవినీతి బయటపడే అవకాశం ఉంటుందని ఎంతో కొంత భయం ఉండే అవకాశం ఉంది.
ఈ లెక్కన చూస్తే తెలుగు ప్రజలు చేయవలసింది – ఈ ఐటీ దాడులని తెలుగుదేశం నాయకులు చెప్పినట్లు తెలుగు ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించడం కాకుండా, నిజానికి తెలుగు ప్రజలందరూ వీటిని స్వాగతించాల్సిన అవసరం ఉంది. నిజంగా అవకతవకలు జరిగి ఉంటే అవి బయటికి రావడం ప్రజలకు మంచి చేసేదే. ఒకవేళ ఎటువంటి అవకతవకలు జరగకపోయి ఉంటే, తమ నిజాయితీని మరోమారు నిరూపించుకునే అవకాశం రావడం తెలుగుదేశం నాయకులకు మంచి చేసేదే. కాబట్టి ఏ రకంగా చూసినా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ లో ఐటీ దాడులను స్వాగతించడమే “బెటర్” ఆప్షన్ గా కనిపిస్తోంది.
-జురాన్ (@CriticZuran)