దర్శక, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఒక తీవ్ర ఆరోపణ వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వేంపల్లి గంగాధరం,”తివిక్రమ్ ఒక మొండి కత్తి” అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
ఆ పోస్ట్ ఇలా వుంది..
”త్రివిక్రమ్ నుంచి మొదటి సారిగా ఏప్రిల్ 15 వ తేదీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. అర్జెంట్ గా హైదరాబాద్ రమ్మని కోరారు. రామోజీ ఫిల్మ్ సిటీ లో ఎన్టీఆర్ తో షూటింగ్ మొదలు కానున్న సందర్భం. హుటాహుటిన వెళ్ళాను. సినిమాలో వచ్చే ఫస్ట్ ఫైట్ తీస్తున్నారు. షాట్ గ్యాప్ లో పరిచయం అయ్యింది. నా పుస్తకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి రాయలసీమ ఫ్యాక్షన్ కథల పై పరిశోధన చేసి సర్టిఫికెట్ పొందిన విషయం విని అభినందించారు. పరిశోధన లో పడిన ఇబ్బందులు, అందులో కొంత సమాచారం ” హిరణ్య రాజ్యం” పుస్తక రూపం రావడాన్ని వారి దృష్టికి తెచ్చాను. సినిమాలో హీరోయిన్ పాత్రకు దీన్ని వాడుకున్నారు. తర్వాత సాయంత్రం ఆరు గంటలకు తనతో పాటూ సితార హోటల్ కు కారు లో తీసుకెలుతూ దారిలో రాయలసీమ మాండలికాల గురించి తెలుసుకున్నారు.హోటల్లో వారి గది లో కూర్చొని నేను రాసిన ఫ్యాక్షన్ కథల వివరాలు అడిగారు. పాపాగ్ని కథల్లో ఉన్న మొదటి కథ ‘మొండి కత్తి’ నేపధ్యం గురించి చెప్పమన్నారు . ఇంత వరకు నేను రాసిన కక్షల కథలు -అందులోని కథల మూలాల గురించి అడిగి తెలుసుకున్నారు.సినిమాలో పదే పదే వచ్చే మొండి కత్తి కథ కు పునాది అదే.అతడిని కలవడం , నా కథల గురించి లోతుగా చెప్పడం నేను చేసిన మొదటి తప్పు. మూడు రోజులు నేను వారితో కలిసి ఉచితంగా వర్క్ చేశాను.తెర పైన పేరు వేయకుండా ఇతరుల కథలను వాడుకునే స్వభావం ఉన్న దర్శకుడి ని కలవడం వల్ల ఇలా కూడా మనం మోసపోతూ ఉంటాం. త్రివిక్రమ్ ఒక తెలివైన మూర్ఖుడు. మనం రాసిన అన్ని కతల్లోంచి ఒక్కో పాత్ర ను దొంగిలించి ఇంకో కొత్త రకం వంటకం వండ గలడు. అలా వండిన కథే అరవింద సమేత!” అని తన పోస్ట్ లో రాసుకొచ్చారు వేంపల్లి.
వేంపల్లి గంగాధరంని త్రివిక్రమ్ కలసి మాట వాస్తవమే. ఆయన్ని అభినందిస్తూ త్రివిక్రమ్ ఒక ఫోటో దిగడం కూడా వార్తల్లోకి వచ్చింది. అయితే వారి మధ్య జరిగిన విషయాలు మాత్రం ఇలా వున్నాయి. గతంలో కూడా త్రివిక్రమ్ పై కాపీ కామెంట్స్ వున్నాయి. హాలీవుడ్ నుండి కొన్ని సీన్స్ ని తీసుకొని కధను రాస్తారని. అయితే ఈసారి ఆరోపణ చేసింది మాత్రం ఒక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు వ్యక్తి. మరి దీనిపై త్రివిక్రమ్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో..