పాత సినిమాల్లో రాఘవయ్య అనే పేరుతో విశ్వాసపాత్రుల క్యారెక్టర్లు ఎక్కువగా ఉంటాయి. హీరోకో.. ఆ కుటుంబానికో.. విధేయంగా.. ఈ రాఘవయ్య ఉంటారు. ఏ పని చెప్పినా… తూ.చ తప్పకుండా చేస్తారు. అలాంటి రాఘవయ్య.. నిజ జీవితంలో.. చిరంజీవికి, పవన్ కల్యాణ్‌కు ఒకరు ఉన్నారు. ఆయనే మారిశెట్టి రాఘవయ్య. పీఆర్పీలో సమయంలోనూ.. కీలకంగా వ్యవహరించారు. జనసేన విషయంలోనూ కీలకంగా వ్యవహరించారు. కాకపోతే.. ఆయన వ్యవహారాలన్నీ తెర వెనుకే ఉంటాయి. ఎప్పుడూ మీడియా ముందుకు రావాలని.. తనకు పబ్లిసిటీ రావాలని అనుకోరు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత… అధ్యక్షుడుగా పవన్ కల్యాణ్ ఉంటే… రెండో వ్యక్తి.. ట్రెజరర్ మారిశెట్టి రాఘవయ్య. ఇంకెవరూ లేరు. జనసేన స్థాపించిన నాలుగున్నరేళ్ల పాటు.. జనసేనకు సంబంధించిన వ్యవహారాలన్నీ మారిశెట్టి రాఘవయ్యే చూసేవారు. పవన్ కల్యాణ్.. తిరుపతిలో అభిమాని కుటుంబానికి పరామర్శకు వెళ్లి అక్కడ ఓ సభ పెట్టాలని అక్కడిక్కడే అనుకున్నారు. రెండు రోజుల్లో ఏర్పాట్లన్నింటినీ ఈ రాఘవయ్యే పూర్తి చేశారు. ఒక్క తిరుపతి మాత్రమే కాదు.. జనసేన తరపున ఏ కార్యక్రమం ఆయినా.. రాఘవయ్య చేతుల మీదుగానే ఆర్గనైజ్ అయ్యేది.
అలాంటి రాఘవయ్య ఇప్పుడు జనసేన వ్యవహారాల్లో కనిపించడం లేదు. కారణం ఏమిటంటే… జనసేనలోకి.. కొత్త కొత్త వలస నేతలు వచ్చి చేరుతున్నారు. వచ్చిన వారంతా… రాఘవయ్యను.. జరుగు.. జరుగు.. అని పక్కకు తోసేస్తున్నారు. అలా తోసేయడానికి పవన్ కల్యాణ్‌కు లేని పోని మాటలు కూడా చెప్పారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో గ్రూపులు మెయిన్ టెయిన్ చేస్తున్నారని… కొత్త వలస నేతలు.. కొంత మంది పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారట. టిక్కెట్ హామీలు కూడా ఇస్తున్నారని.. పవన్ కల్యాణ్ గట్టిగా నమ్మారు. దీంతో పవన్ కల్యాణ్.. రాఘవయ్యపై టెంపర్ చూపించేశారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా మనస్థాపం చెందిన రాఘవయ్య.. ఇంటి పట్టునే ఉంటున్నారు. జనసేన వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన రాజకీయ భవిష్యత్ కోసం రాలేదు .. మెగా కుటుబానికి ఓ విధేయుడిగా మాత్రమే ఉన్నాడు కాబట్టి… తనపై నమ్మకం లేని చోట ఉండటం ఎందుకని.. సైలెంట్‌గా ఇంటికెళ్లిపోయారు.
మెల్లగా మరిశెట్టి రాఘవయ్య విషయం బయటకు రావడంతో.. జనసేన వర్గాలు కంగారు పడుతున్నాయి. ఆయనను మళ్లీ పార్టీలో యాక్టివ్ చేయడానికి రాయబారాలు నడుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా.. మనస్ఫూర్తిగా చేస్తున్నది కాదని.. పార్టీకి మొదటి నుంచి పిల్లర్‌గా మారిన వ్యక్తిని… అవమానించి పంపేశారన్న ప్రచారం జరిగితే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న కారణంగా.. ప్రస్తుతం బుజ్జగింపులు చేస్తున్నారని… రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏమైనా… మారిశెట్టి రాఘవయ్య.. రాజకీయ జీవితం కోసం.. పవన్ కల్యాణ్ వెంట నడవలేదు కాబట్టి.. జనసేనకు ఆయన దూరం అవడం వల్ల ఆయనకు వచ్చే నష్టమేమీ లేదు.. కానీ.. నిజాయితీగా పని చేసిన ఓ నేత సేవలను కోల్పోతే.. అది.. జనసేనకే నష్టమని.. కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.