ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ధమన్ .. సృజించిన కవాతు పాటను… జనసేన కార్యకర్తలు ఆన్లైన్లో వైరల్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలోనే.. పవన్ కల్యాణ్ గతంలో మట్లాడిన కొన్ని మాటలు… డబుల్ వైరల్ అయిపోయారు. ఆ మాటలు.. పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పోరాటయాత్రలో భాగంగా సిక్కోలులో మాట్లాడిన మాటలు. వాటిల్లో ఏముందంటే..” ఉత్తరాంధ్రకు.. చంద్రబాబు లేకపోవచ్చు.. జగన్ పట్టించుకోకపోవచ్చు.. అసలు రాజకీయ నేతలెవరూ పట్టించుకోకపోవచ్చు.. కానీ నేనున్నాను.. పవన్ కల్యామ్‌ను ఉన్నాను..” అని హైపిచ్‌లో గుండెలు బాదుకుటూ… చెప్పిన డైలాగ్ అది. పవన్ కల్యాణ్ తనదైన స్టైల్లో ఆ డైలాగ్ చెబుతూంటే.. సిక్కోలు వాసులకు రొమాలు నిక్కబొడుచుకుని ఉంటాయి. మరి ఇప్పుడు ఈ డైలాగ్స్ ఎందుకు హైలెట్ అవుతున్నాయి..?
సాయం కోసం ఎదురు చూస్తున్న సిక్కోలు..!
శ్రీకాకుళం జిల్లాను టిట్లి తుపాను అతలాకుతలం చేసింది. ఆరు మండలాల వరకు.. సర్వం తుడిచి పెట్టుకుపోయింది. లక్షల మంది మొత్తం కోల్పోయారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడే మకాం వేసింది. ఎంత ప్రభుత్వం అయినా.. అలాంటి విపత్తు సంభవించినప్పుడు… “అబ్రకదబ్ర” అని అని అన్నీ చేయలేదుగా..! అందరూ తమ వంతు సాయం చేయాలి. వైసీపీ నేతలు… ధర్నాలు చేస్తున్నారు. అదే తమ వంతు సాయం అనుకుంటున్నారు. కానీ సిక్కోలుకు ఎవరూ లేకపోయినా నేనున్నానంటూ.. సూపర్ హిట్ డైలాగులు కొట్టిన పవన్ కల్యాణ్.. ఇప్పుడా జిల్లా కష్టాల్లో ఉంటే కనీస సానుభూతి చూపించలేకపోతున్నారు., తుపాను వచ్చిన రోజే… ప్రత్యేక విమానంలో.. తిరుపతికి వెళ్లి… అదే విమానంలో తిరిగి వచ్చి.. ఆ తర్వాత.. నాదెండ్ల మనోహర్‌ను పార్టీలో చేర్చుకుని.. కొత్త పార్టీ ఆఫీసు ప్రారంభించి ఉత్సాహంగా గడిపారు. కానీ తర్వాత రోజైనా వెళ్తారా అనుకుంటే.. “సెక్యూరిటీ ప్రాబ్లం” కారణంగా వెళ్లలేను.. పదిహేడో తేదీన వెళ్తానని ప్రకటించారు.
కోట్ల రూపాయల బడ్జెట్ తో కవాతు..!
అదే సమయంలో ఆయన ధవళేశ్వరం బ్రిడ్జిపై… దేశం మొత్తం ఉలిక్కి పడేలా… భారీ కవాతును నిర్వహిస్తున్నారు. సోమవారం జరగనున్న ఈ కవాతు కోసం… కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారని.. ఇటీవలి కాలంలో జనసేన మౌత్ పీస్‌గా మారిన మీడియాలో గొప్పగా చెబుతున్నారు. హెలికాఫ్టర్లతో పూలు చల్లించడం… పడవలతో ముట్టడించడం సహా.. బస్సులు, కార్లతో వెల్లువలా తరలి రావడం వరకూ చాలా విశేషాలు ఉన్నాయి. కానీ పవన్ కల్యాణ్‌కు ఇష్టమైన … ఉత్తారంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతూంటే.. కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టి కవాతు నిర్వహించడమేమిటన్న విమర్శలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ కార్యకర్తలే పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. శ్రీకాకులం జిల్లా పవన్ ఫ్యాన్స్ కూడా… కవాతుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.
కవాతుకు సరైన సమయమేనా..?
రాజకీయ పార్టీకి హంగు ఆర్భాటాలు ముఖ్యమే కానీ… రాష్ట్రంలో..ఓ ప్రాంతం తీవ్రమైన ప్రకృతి విపత్తును ఎదుర్కొంటున్నప్పుడు.. ఇలా ఓ షో చేయడం మాత్రం… కరెక్ట్ కాదు. అది రాంగ్ టైమింగ్ అవుతుంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ ఎందుకు… ముందుకెళ్తున్నారో.. వాయిదా వేసి.. ఉద్దానంను సందర్శిస్తే మంచి ఇమేజ్ వస్తుందన్న విషయాన్ని పవన్ ఎందుకు పట్టించుకోవడం లేదో.. ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు.