ఇవాళ పవన్ కళ్యాణ్ జన సేన ఆధ్వర్యంలో కవాతు నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం పిచుక లంక వద్ద మొదలై ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా కాటన్ విగ్రహం వరకు ఈ కవాతు జరుగుతుంది. ఆ తర్వాత బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతారు. చాలా భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం తలపెట్టుకున్నారు. బన్నీ వాసు , కందుల దుర్గేష్ మొత్తం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటు తెలుస్తోంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీ ఎత్తున అభిమానులు ఈ కవాతు లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
ఈ కవాతు పై కొన్ని విమర్శలు కూడా మొదలయ్యాయి. వాటిలో మొదటిది, దీన్ని రాజకీయ కార్యక్రమం లా కాకుండా సినిమా ఈవెంట్ లాగా నిర్వహిస్తున్నారు అన్నది. సంగీత దర్శకులతో పాటలు కంపోజ్ చేయించి, ఈవెంట్ మేనేజర్ లతో ఏర్పాట్లు చేయించి చేస్తున్నారు కాబట్టి ఇది సినిమా ఈవెంట్ లాగా ఉన్నది అన్నది ఈ విమర్శ. ఇక రెండవ విమర్శ శ్రీకాకుళంలో తుఫాన్ తీవ్ర నష్టాన్ని కలిగించిన ఈ సమయంలో ఇలాంటి కవాతు అవసరమా అన్నది. అలాగే మూడవ విమర్శ ఒకటుంది. ఈరోజు కొన్ని టీవీ ఛానల్ లో మాట్లాడిన విశ్లేషకులు, యాంకర్లు ఈ కవాతుని జగన్ తూర్పుగోదావరి జిల్లాలోనే రాజమండ్రి బ్రిడ్జి మీద నిర్వహించిన పాదయాత్రతో పోలుస్తూ పవన్ కళ్యాణ్ జగన్ ని కాపీ కొడుతున్నాడు అంటూ చెప్పుకొచ్చారు.
అయితే గతంలో ఇదే తరహా విమర్శ రివర్స్లో, జగన్ పవన్ కళ్యాణ్ ని కాపీ కొడుతున్నాడు అంటూ వచ్చేవి. (Click here for : Is Jagan copying from Pawan Kalyan?? ). మొదటి రెండు విమర్శల సంగతి కాస్త పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ జగన్ ని కాపీ కొడుతున్నాడు అన్న వ్యాఖ్యలను మాత్రం జనసేన అభిమానులు దీటుగానే తిప్పి కొడుతున్నారు. పవన్ కళ్యాణ్ గంగమ్మ పూజలతో ఉత్తరాంధ్ర పర్యటన మొదలు పెడితే, జగన్ కూడా ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా తన గోదావరి పర్యటనలో గోదారమ్మ పూజలు చేశారని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే సభా ప్రాంగణానికి విశిష్ట వ్యక్తుల పేర్లు పెట్టే సాంప్రదాయానికి పవన్ కళ్యాణ్ తెరతీశాడు. అనంతపురంలో పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు కల్లూరి సుబ్బారావు వేదిక అని అలాగే తరిమెల నాగిరెడ్డి ప్రాంగణం అని తన సభకు పేర్లు పెడితే ఆ తర్వాత జగన్ తన ఉత్తరాంధ్ర సభకు గురజాడ అప్పారావు సభ అంటూ పేరు పెట్టారు. ఇక ఈ కవాతులు అన్న వాటిని తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంతవరకు రాజకీయాల్లో మొదలుపెట్టింది పవన్ కళ్యాణ్ అని, గతంలో జగన్ ఎప్పుడు ఈ తరహా కవాతులు నిర్వహించలేదని వారు వైఎస్ఆర్సిపి అభిమానుల విమర్శలను తిప్పి కొడుతున్నారు. అలాగే ఎప్పుడు చంద్రబాబు మీద మాత్రమే విమర్శలు చేస్తూ కొనసాగే జగన్ ఉపన్యాసాల్లో కూడా ఇటీవల కాలంలో మార్పు వచ్చిందని, పవన్ కళ్యాణ్ తరహాలో స్థానిక సమస్యల మీద మాట్లాడడం జగన్ మొదలుపెట్టాడని జనసేన అభిమానులు గుర్తు చేస్తున్నారు.
అలాగే జనసేన కవాతు సినిమా ఈవెంట్ లాగా జరుగుతుందన్న విషయాన్ని కూడా జనసేన అభిమానులు లైట్ తీసుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు నిర్వహించే ఈ కార్యక్రమానికి వెనుక ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉండడం, ఏర్పాట్లను పర్యటించడం ఈ రోజుల్లో సర్వ సాధారణం అయిందని వారంటున్నారు. అయితే, శ్రీకాకుళం తుఫాను విషయంలో మాత్రం జనసేన అభిమానులు కూడా విమర్శలతో ఏకీభవిస్తున్నారు. అయితే ఇది ముందుగానే ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం కాబట్టి, ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే శ్రీకాకుళంలో సహాయక చర్యల కోసం పవన్ కళ్యాణ్ పిలుపునిస్తే బాగుంటుందని, గతంలో హుదుద్ తుఫాన్ సమయంలో 50 లక్షలు విరాళం ఇచ్చి తన ఉదారతను చాటుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు కూడా అలాగే తన ఉదారతను ప్రకటిస్తే బాగుంటుందని జనసేన అభిమానులు అనుకుంటున్నారు.
ఏది ఏమైనా జనసేన కవాతు మీద ప్రస్తుతానికి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల పార్టీలో చేరిన నాయకులకు కూడా ఈ కవాతు విజయవంతం చేయడం అనే బాధ్యత అప్పగించడం వల్ల, వారు కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అలాగే కవాతు అనంతరం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతాడు, ఈసారి ఎవరిని టార్గెట్ చేస్తాడు అనే అంశంపై ఆసక్తి నెలకొంది.