ఈ నెలాఖరుతో గ్రేటర్ ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తుంది కనుక రేపటి నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. ఈనెల 30న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఇరువురు ముఖ్యమంత్రుల కొడుకులు తమతమ పార్టీల తరపున ఉదృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలలో పోటీ ప్రధానంగా అధికార తెరాసకి తెదేపా, బీజేపీ కూటమికి మద్యే సాగుతున్నట్లు పైకి కనబడుతున్నప్పటికీ, కాంగ్రెస్, మజ్లీస్, వామపక్షాల కూటమి వంటివి కూడా బరిలో ఉన్నందున అన్ని పార్టీల మధ్య ఓట్లు చీలిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఇరువురు ముఖ్యమంత్రులు కూడా గట్టిగా ప్రచారం చేస్తే, ప్రజలపై వారి ప్రభావం చేత ఆ చీలిక మరింత ఖరారు అవవచ్చును.
ఈ ఎన్నికల నుండి వైకాపా అకస్మాత్తుగా తప్పుకోవడంతో అది తమకు కలిసి వస్తుందని తెదేపా, బీజేపీ కూటమి ఆశ పడింది. కానీ అన్ని పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేస్తున్న కొద్దీ వాటికి ఆ ప్రయోజనం దక్కే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. వరంగల్ ఉపఎన్నికలలో తెరాస ఏకపక్షంగా విజయం సాధించిన తరువాత, గ్రేటర్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి కనీసం 80 స్థానాలు దక్కించుకొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు. ఆ తరువాత తెరాస ఎన్నికల రధసారధిగా బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు కె.టి.ఆర్. మరో అడుగు ముందుకు వేసి వంద స్థానాలు దక్కించుకొంటామని లేకుంటే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. కానీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వారం, పదిరోజుల్లోనే అకస్మాత్తుగా పరిస్థితులు మారిపోయాయి.
ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలలో గెలుస్తాయో లేదో తెలియకపోయినా ఊహించిన దానికంటే చాలా ఎక్కువగానే అధికార పార్టీకి చాలా గట్టి పోటీనిస్తున్నాయి. కనుకనే కేసీఆర్ కుమారుడు తన వంద స్థానాల సవాలుని ఉపసంహరించుకోవలసి వచ్చింది…చంద్రబాబు కుమారుడు ఈ ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాబోదని ప్రకటించారని స్పష్టమవుతోంది. ఒకవేళ ఈ ఎన్నికలలో తెరాస అతిపెద్ద పార్టీగా అవతరించినట్లయితే, మజ్లీస్ పార్టీతో మళ్ళీ చేతులు కలిపి జి.హెచ్.ఎం.సి.ని దక్కించుకోవచ్చును. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు కల్పించడం ద్వారా మేయర్ పదవిని దక్కించుకోవాలని తెరాస ఆలోచిస్తోంది.