జనసేన కవాతు సభలో భావోద్వేగపూరితంగా మాట్లాడారు పవన్ కల్యాణ్. కవాతు అంటే సైనికులు మాత్రమే చేస్తారనీ, కానీ ఇవాళ్ల జనసైన్యం కవాతు చేయాల్సి వచ్చిందన్నారు. ఎందుకంటే, వ్యవస్థ కుళ్లిపోయిందనీ, అవినీతిని ప్రక్షాళన చేయాలనీ, వ్యవస్థను సమూలంగా మార్చాలనీ, విప్లవం ద్వారా బుద్ధి చెప్పాలని చేసిన కవాతు ఇది అన్నారు పవన్. తనకు 2009లోనూ ఇంతే బలం ఉందనీ, 2014లోనూ ఇదే బలం ఉందనీ… కానీ, ఎన్నికల్లో ఎందుకు పోటీ చెయ్యలేదో తెలుసా అంటూ వివరించారు! తనకు అనుభవం కావాలనీ, దేశభక్తి ఉన్న వ్యక్తిగా… నేరుగా ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా మద్దతు ఇచ్చానన్నారు! కానీ, తాను ఏనాడూ పదవి అడగలేదనీ, భవనాలు అడగలేదనీ, దేశం మీదున్న ప్రేమతో ఇలా వ్యవహరించానని పవన్ చెప్పారు. ఆ తరువాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ పల్లకి మోసేదిగానే జనసేన ఉండాలని ముఖ్యమంత్రి అనుకుంటారన్నారు. అనుభవం ఉన్న నాయకుడి అవసరం ఉందన్న ఉద్దేశంతోనే టీడీపీకి తాను మద్దతు ఇచ్చాననీ… కానీ, ఇప్పుడా అనుభవం ఏమైందని ప్రశ్నించారు? రాష్ట్రంలో ఏ మూలకి వెళ్లినా మౌలిక సదుపాయాలు లేవన్నారు. తాను విజయవాడ నుంచి వస్తుంటే.. దారి పొడవునా హోర్డింగులు చూశాననీ, చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని అవి ఉన్నాయనీ, మళ్లీ వచ్చి ఏం చేస్తారని పవన్ మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ కి ఏ అనుభవం ఉందని పంచాయతీరాజ్ శాఖకు మంత్రిని చేశారనీ, సర్పంచ్ గా గెలవలేరని ఎద్దేవా చేశారు. తండ్రి వారసత్వం అంటే డి.ఎన్.ఏ. రావడం, పోలికలు రావడమనీ.. అంతేగానీ అనుభవం రాదని పవన్ కల్యాణ్ చెప్పారు.
ఈ సందర్భంలో ప్రజల్లోంచి ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు వినిపిస్తుంటే.. వాటిపై పవన్ స్పందిస్తూ, ఆ కోరిక నిజమై తీరుతుందన్నారు. అయితే, ముఖ్యమంత్రి పదవి అలంకారం కాదనీ, వారసత్వం అంతకన్నా కాదన్నారు. తన తండ్రి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, జగన్ ముఖ్యమంత్రి అవుతా అంటున్నారన్నారు. తాను రెండు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉంటున్నాననీ… తన నుంచి ప్రజలు కోరుకున్నది నిజమై తీరుతుందని మరోసారి పవన్ చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో గెలుస్తామనే ధైర్యం చంద్రబాబు నాయుడుకి లేదనీ, అందుకే తన దగ్గరకి వచ్చి మద్దతు కోరారు అన్నారు. 2019 ఎన్నికలు చాలా కీలకమైనవనీ, ముఖ్యమంత్రితోపాటు ప్రతిపక్ష నేత కూడా పద్ధతి మార్చుకోకపోతే… ఆ తరువాతి పరిణామాలకు వారందరూ బాధ్యతల వహించాల్సి ఉంటుందన్నారు!!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే తనక భయం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి వెళ్దామని చంద్రబాబు ఏనాడూ తనతో అనలేదనీ, ఇప్పుడైనా అఖిలపక్షం తీసుకెళ్లాలని కోరారు. ఢిల్లీకి వెళ్లి, గల్లీల్లో పోరాటం చేసేందుకు తాను సిద్ధమని… చంద్రబాబు నాయుడు సిద్ధమా అని ప్రశ్నించారు. తాను కాపు కులంలో పుట్టాననీ, అన్ని కులాలనూ గౌరవిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. సో… ఇలా పవన్ ప్రసంగం సాగింది.