జగన్‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం టీడీపీకి లేదని పవన్ కల్యాణ్ తేల్చారు. రాజమండ్రిలో ధవళేశ్వరం వంతెనపై కవాతు కార్యక్రమం నిర్వహించిన జనసేన అధినేత భారీగా హాజరైన కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాననే నమ్మకం చంద్రబాబుకు లేదన్నారు. అవినీతికి వ్యతిరేకంగా జనసేన కవాతు చేసిందన్నారు.
ప్రజలను చంద్రబాబు, మోదీ మోసం చేశారని.. రాజకీయ అవినీతిపై యువత ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు. పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని.. అనుభవం కోసమే ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. జనసేన..టీడీపీ పల్లకీ మోయాలని చంద్రబాబు కోరుకుంటున్నారని విమర్శించారు. పవన్ మద్దతు కోరుకుంటారు కానీ.. అభివృద్ధిపై సలహాలు అడగరన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతేనని .. జన్మభూమి కమిటీలు కాదని.. .. దోపిడీ కమిటీలన్నారు. మళ్లీ చంద్రబాబు వస్తే రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు.
నన్ను సినిమా నటుడన్న టీడీపీ నేతలపైనా విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయలేని వ్యక్తిని.. పంచాయతీరాజ్‌శాఖ మంత్రిని చేశారు: పవన్ లోకేష్‌కు ఏం తెలుసని మంత్రిని చేశారన్నారు. విదేశీ కంపెనీలను తీసుకురావడం కాదు.. రోడ్డుపక్కన ఉన్న చిరువ్యాపారులను పట్టించుకోవాలని లోకేష్ కు సలహా ఇచ్చారు. కార్యకర్తల ‘సీఎం నినాదం’ ఏదో ఒకరోజు నిజమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. వారసత్వంతో సీఎం అవుదామని జగన్, లోకేష్ అనుకుంటున్నారని కానిస్టేబుల్ కుమారుడు సీఎం కాలేడా? అని పవన్ ప్రశ్నించారు. కవాతు సభలో పవన్ కల్యాణ్ హామీల వర్షం కూడా కురిపించారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం సీపీఎస్ రద్దుపైనే పెడతానన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సంతకం పెడితే రద్దుఅయ్యేది సీపీఎస్ కాదనే విషయాన్ని మాత్రం పవన్ గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే సర్పంచ్‌లకు చెక్ పవర్ తీసుకొస్తామన్నారు. సర్పంచ్‌లకు బదులు జన్మభూమి కమిటీలకు చెక్‌పవర్ ఉండటమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భయపడుతున్నారు కాబట్టే పంచాయతీ ఎన్నికలు పెట్టడం లేదని.. పంచాయతీ ఎన్నికలు పెడితే జనసేన సత్తా చూపిస్తామన్నారు.
చంద్రబాబును సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెడుతున్నారు కానీ.. నాలుగేళ్ల వరకు తాను ఏమ అనలేదన్నారు. ప్రతిపక్షం హూందాగా లేకపోయినా.. నేను ఎప్పుడూ జగన్‌లా ప్రవర్తించలేదన్నారు. జనసేన కవాతుకు జనసేన వర్గాలు ప్రచారం చేసినట్లుగా.. రెండు లక్షల మంది రాలేదు కానీ… 30,40 వేల మంది వరకూ వచ్చారనే అంచనా ఉంది. సభలో .. అనూహ్యంగా జగన్ ను పొగడటం మాత్రం… జనసేన కార్యకర్తలను ఆశ్చర్య పరిచింది. ఎవరైనా తనను ఎదుర్కొనే ధైర్యం లేదని.. ఇతర పార్టీలకు సవాల్ చేస్తారు కానీ.. పవన్ .. తన ప్రత్యర్థి పార్టీ అయిన జగన్ ను ఎదుర్కొనే దమ్ము లేదని.. అధికార పక్షాన్ని అనడం.. అందర్నీ విస్మయానికి గురి చేసింది.