మహా కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఆలస్యం అవుతూ ఉండటంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు తెలంగాణ జనసమితి వ్యవస్థాపకుడు కె. కోదండరామ్. సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయన్నారు. వాస్తవానికి ఇంత తాత్సారం జరగడం మంచిది కాదంటూ మంచిర్యాల జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అయితే, చర్చల ప్రక్రియ ఇప్పుడు కొంత వేగంగానే సాగుతోందనీ, ఒకట్రెండు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం ఉంటుందన్నారు. ఈ చర్చలు అర్థవంతంగా ముగిస్తే… తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పునకు అదొక సాధనం అవుతుందన్నారు.
గౌరవమైన భాగస్వామ్యం ఉన్నప్పుడే తాము ఇతర పక్షాల కోసం ధైర్యంగా పని చెయ్యగలుగుతాం అన్నారు. కూటమి అజెండాను వీలైనంత వేగంగా జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, 2009లో కూడా అన్ని పార్టీలూ కలిసి మహా కూటమి పెట్టారనీ, కానీ నిలదొక్కుకో లేకపోయిందనీ, దానికి కారణం కూడా ఇలానే ఆలస్యంగా నిర్ణయాలు ఉండటమే అన్నారు. ఆ అనుభవం నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందన్నారు. అయితే, బలమైన అజెండాతో సంఘాలనూ పార్టీలనూ కలుపుని వెళ్లడం వల్ల యు.పి.ఎ. 1 విజయవంతం అయిందన్నారు. కాబట్టి, ఆలస్యమయ్యే కొద్దీ ఎలాంటి ఫలితాలు ఉంటాయనేదానికీ ఉదాహరణ ఉందీ, స్పష్టంగా ముందుకు సాగితే విజయమనడానికీ ఒక ప్రయోగం కనిపిస్తోందన్నారు.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మరింత బాధ్యతాయుతంగా తొందరగా ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని కోదండరామ్ సూచించారు. సీట్ల నంబర్లపై రకరకాల కథనాలు రావడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి గందరగోళం ఏ పార్టీకీ మంచిది కాదన్నారు. చలనం అనేది చాలా వేగంగా ఉండాలన్నారు. మొత్తానికి, కోదండరామ్ చెప్పేది ఏంటంటే… కాంగ్రెస్ పార్టీ కారణంగానే మహా కూటమి వేగవంతంగా ముందుకు సాగడం లేదన్నారు. వాస్తవం కూడా అదే. అయితే, కాంగ్రెస్ తీరు వల్ల భాగస్వామ్య పక్షాల్లో కూడా కొంత నలత మొదలైందని చెప్పడానికి కోదండరామ్ పరోక్ష వ్యాఖ్యలే సాక్ష్యం. సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆలస్యమయ్యే కొద్దీ భాగస్వామ్య పక్షాల మధ్య కాంగ్రెస్ పై ఒక రకమైన వ్యతిరేక భావన పెరిగే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా పరిస్థితిని చూడొచ్చు.