టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీల మూట విప్పారు. తాము గెలిస్తే అన్ని వర్గాలకూ.. సంక్షేమం కలిగించేలా… కొత్త కొత్త పథకాలు ప్రకటించారు. ఉన్నవాటిని మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. రైతులకు రూ. లక్ష రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఏక మొత్తంగా.. రూ. 2 లక్షల హామీని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూండటంతో.. దానికి కౌంటర్ గా రూ. లక్ష ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మొదట్లో రూ. 2 లక్షలు రుణమాఫీ అన్నప్పుడు.. సాధ్యం కాదని కేసీఆర్ ఖండించారు. అయినా రూ. లక్ష రుణమాఫీ ప్రకటించారు. ఇక రైతుబంధు కింద ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు .. రెండు విడతలుగా ఎనిమిది వేలు ఇస్తున్నారు. దీన్ని మరో రెండు వేల పెంచుతామని ప్రకటించారు. రైతుసమన్వయ సమితులను యాక్టివేట్ చేస్తామని ..వాటికి గౌరవ భృతిపై ఆలోచిస్తామన్నారు.
ఇక కేసీఆర్ మరో ప్రధాన హామీ నిరుద్యోగభృతి రూపంలో ఇచ్చారు. నిరుద్యోగులకు నెలకు రూ. 3016 భృతి ఇస్తామని ప్రకటించారు. నిరుద్యోగులు ఎంత మంది ఉన్నా అందరికీ ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. ఇక నుంచి 57 ఏళ్లు పూర్తయిన వారందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు. వయోపరిమితి పెంపుతో 8 లక్షల మందికి లబ్ధి కలుగుతుందన్నారు. వృద్ధుల పెన్షన్ రూ.2016కు పెంచుతామని హామీ ఇచ్చారు. వికలాంగులకు పెన్షన్ రూ.3016కు పెంచుతామన్నారు. కోటి ఎకరాలకు నీరివ్వాలనుకున్నాం…100 శాతం సఫలీకృతమయ్యామన్నారు కేసీఆర్. 2020 జూన్‌లోగా తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాళేశ్వరం, సీతారామ, దేవాదుల ప్రాజెక్టులు పూర్తవుతాయని.. కొత్త, పాత ప్రాజెక్టులతో కలిపి కోటి ఎకరాలకు సాగునీరిస్తామన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని కొనసాగిస్తామన్నారు.
ఐకేపీ మహిళలకు సబ్సిడీ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇస్తామని.. నియోజకవర్గానికి ఒకటి లేదా రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరు చేస్తామన్నారు. ఎన్నికలు మిగిలిన వారికి రాజకీయ క్రీడ..మాకు మాత్రం ఓ టాస్క్ అని కేసీఆర్ విశ్లేషించారు. భవిష్యత్‌లో కేంద్రాన్ని శాసించే స్థితిలో చాలా పెద్ద మార్పు ఉంటుందని జోస్యం చెప్పారు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఉంటే ప్రాజెక్టులు, ప్యాకేజీలు తెచ్చుకోవచ్చని.. ఏడాదికి 30 వేల కోట్ల ప్రాజెక్టులు అదనంగా తెచ్చుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ఆదాయానికి తగ్గట్లే.. హామీలు ఇస్తున్నామని.. రాజకీయాలు, ఓట్ల కోసం ప్రలోభపెట్టాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేసారు. చెప్పింది తప్పకుండా అమలు చేస్తాన్నారు. వచ్చే ఐదేళ్లలో తెలంగాణ రూ. 2.30 లక్షల కోట్ల అప్పు చెల్లించాల్సి ఉందని,.. కానీ ఐదేళ్లలో ఆదాయం మాత్రం.10 లక్షల 30వేల కోట్లు ఉంటుందన్నారు. అప్పు చెల్లించడం వల్ల 1.30 లక్షల కోట్ల అప్పు తీసుకునే అవకాశముందన్నారు.