ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాతోపాటు, రాష్ట్రాన్ని స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నామన్నారు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్. మంగళగిరిలో భాజపా రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన చేయడానికి ఆయన వచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఉచ్చులోపడ్డారనీ, దానిలో పడ్డవారు బాగుపడింది లేదన్నారు. కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమే భాజపాతో పొత్తు విషయంలో చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకున్నారని ఆరోపించారు. విభజన చట్టంలో ఉన్నవన్నీ అమలు చేయడానికి ఇప్పటికీ తాము సిద్ధంగానే ఉన్నామని ఆయన చెప్పడం గమనార్హం.
ఆంధ్రా అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కట్టుబడి ఉందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 1500 కోట్లు ఇచ్చామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత తమదేననీ, సకాలంలో పూర్తయ్యేందుకు కావాల్సిన నిధులు ఇస్తున్నామన్నారు. విజయవాడ అభివృద్ధికి రూ. 1000 కోట్లు ఇచ్చామన్నారు. వీటితోపాటు, రాష్ట్ర అవసరాలు అన్నింటికీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్డీయే నుంచి చంద్రబాబు నాయుడు ఎందుకు బయటకి వచ్చారో తనకు ఇప్పటికీ తెలీదన్నారు రాజ్ నాథ్ సింగ్. కేవలం రాజకీయ అవసరాలను మాత్రమే ఆయన చూసుకున్నారని ఆరోపించారు.
ఎన్డీయే నుంచి ఎందుకు టీడీపీ బయటకి వచ్చిందో తనకు ఇప్పటికీ తెలీదనడంలో ఈ రాష్ట్రం పట్ల కేంద్రం ధోరణి ఏ విధంగా ఉందనేది మరోసారి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నామన్నారు రాజ్ నాథ్. ట్రీట్మెంట్ అనే ఈ పదాన్ని ఏ అర్థంలో ఆయన వాడినట్టు..? రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్ని అడ్డుకుంటూ, భాజపా నేతల చేత ముఖ్యమంత్రిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయిస్తూ, భారీ ఎత్తున ఐటీ దాడులను తెర వెనక నుంచి ప్రోత్సహిస్తూ, దశాబ్దాలు కిందట మరుగునపడ్డ ఏవో చిన్న కేసుల్ని వెలికి తీసేలా తెర వెనక వ్యూహాలు నడుపుతూ… స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఇదేనేమో..! విభజన చట్టంలో హామీలు అమలుకు ఇంకా కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పడం మరీ విడ్డూరం. ఇంకెన్నాళ్లు ఇలా కట్టుబడి ఉంటారు? ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కడప ప్లాంట్, రెవెన్యూ లోటు.. ఇలాంటి అంశాలపై రాజ్ నాథ్ మాట్లాడి ఉంటే కొంతైనా అర్థవంతంగా ఉండేది.