సోమవారం రోజు… కొన్ని మీడియా సంస్థల అధినేతలు.. ముఖ్యంగా.. టీవీ చానళ్ల అధినేతలకు… ఓ ఫోన్ కాల్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే… జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భారీ కవాతు నిర్వహిస్తున్నారు. ఆ కవాతు ప్రోగ్రాంను.. మొదటి నుంచి చివరి వరకూ పూర్తి స్థాయిలో ప్రయారిటీ ఇచ్చి కవర్ చేయండి.. అనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. ఈ ఫోన్ చేసింది… జనసేనకు చెందిన ముఖ్యనేతలైతే.. మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ ఫోన్ చేసింది.. రామ్మాధవ్. ఆరెస్సెస్ నుంచి.. నేరుగా బీజేపీలోకి వెళ్లి… ఏకంగా ప్రధాన కార్యదర్శిగా పదవిలోకి దిగిపోయిన నేత. టీడీపీ ఎన్డీఏకు గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన ఏపీ బాధ్యతలు తీసుకున్నారు. అలాంటి వ్యక్తి.. బీజేపీకి సంబంధించిన కార్యక్రమం జరిగితే.. మంచి కవరేజీ ఇవ్వాలని మీడియా అధినేతలకు ఫోన్ చేస్తారు కానీ… జనసేనకు కవరేజీ ఇవ్వమని ఫోన్ చేయడమే.. అందర్నీ ఆశ్చర్య పరిచింది.
పవన్ కల్యాణ్ కోసం.. జనసేన పార్టీ కోసం… రామ్మాధవ్ అంత కేర్ ఎందుకు తీసుకుంటున్నారన్నది చాలా మందికి అర్థం కాలేదు కానీ… ఇంత కాలం ఏపీలో ప్రచారం జరుగుతున్నట్లుగా… ఉన్న తెర వెనుక రాజకీయ వ్యూహాలు మాత్రం అమల్లో పెట్టారన్న విషయంపై క్లారిటీ వస్తోంది. రామ్మాధవ్ ఏపీ బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా కొద్ది సార్లు మాత్రమే అధికారికంగా ఏపీకి వచ్చారు. కానీ అంతకు మించి .. పదుల సార్లు హైదరాబాద్ వచ్చారు. ఏపీ రాజకీయాలపై విస్తృత చర్చలు జరిపారు. అనేక సార్లు దీనిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. కానీ గాసిప్స్ గానే ఉండిపోయాయి. కొద్ది రోజుల క్రితం కాకినాడలో జరిగిన బీజేపీ కార్యకవర్గ సమావేశంలో రామ్మాధవ్… మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో… రాజకీయవర్గాలకు కొంత క్లారిటీ వచ్చినట్లయింది.
దానికి తగ్గట్లుగానే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయన్న ప్రచారం ఊపందుకుంటోంది. అయితే.. బీజేపీకి ఉన్న బ్యాడ్ ఇమేజ్ కారణంగా.. మూడు పార్టీలు కలిస్తే.. మైనస్ అవుతుందని… జనసేన, వైసీపీ నేరుగా పొత్తులు పెట్టుకుని.. బీజేపీకి మాత్రం లోపాయికారీ సహకారం ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే… సీట్ల సర్దుబాట్లు ప్రారంభమయ్యాయని… గుంటూరు పశ్చిమ అసెంబ్లీ, తెనాలి, నర్సాపురం పార్లమెంట్ ఇలా… కేటాయించేశారని కూడా… చెబుతున్నారు. పవన్ కోసం.. నేరుగా రామ్మాధవ్ రంగంలోకి దిగడంతో.. వీవీటిపై ఇప్పుడిప్పుడే.. క్లారిటీ వస్తుందని అనుకోవచ్చేమో..?