దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నేత. ఓపక్క మూడు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మరోపక్క కొద్ది నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను మాట్లాడేది లేదని ఆయన స్పష్టం చేయడం విశేషం! పార్టీ తరఫున జరిగే ఏ కార్యక్రమంలోనూ తాను పాల్గొననీ, ప్రసంగాలకు దూరంగా ఉంటాననీ, ప్రచారాల్లో కూడా మాట్లాడననీ ఆయన తెగేసి చెప్పేశారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… తాను పార్టీ తరఫున మాట్లాడితే, అది పార్టీకే మైనస్ అవుతుందన్నారు. బహిరంగ సభల్లో తాను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తగ్గిపోవడం ఖాయమని చెప్పారు.
తాను దేనిపై మాట్లాడుతున్నా వివాదం అవుతోంది కాబట్టి, అందుకే ఎన్నికలు ముగిసేవరకూ మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే, పార్టీ నిర్ణయం అందరికీ శిరోధార్యమనీ, మనకు నచ్చనివారిని బరిలోకి దించినా సరే మద్దతు ఇచ్చి గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నిజానికి, దిగ్విజయ్ సింగ్ ఇలా నిర్ణయించుకోవడానికి కారణం ఉంది. అదేంటంటే… మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తిస్ గడ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో ఇతర పార్టీల పొత్తులు కాస్త బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. దిగ్విజయ్ సింగ్ తీరు వల్లనే పొత్తులు చెడిపోయాయనే అభిప్రాయం ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
కాంగ్రెస్ తో తమ పొత్తు చెడిపోవడానికి కారణం దిగ్విజయ్ సింగ్ అంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు! ఆ మూడు రాష్ట్రాల్లో తమ పార్టీతో పొత్తుకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సుముఖంగా ఉన్నారనీ, ఈయన వల్లనే పొత్తులు చెడిపోయాయని ఆమె అన్నారు. ఈడీ వంటి సంస్థల దాడుల భయంతోనే ఆయన పొత్తుల్ని విచ్ఛిన్నం చేస్తున్నారన్నారు. ఈ విమర్శల కారణంగానే మౌనవ్రతం అంటూ ముక్కున వేలేసుకుని కూర్చుంటానని దిగ్విజయ్ అంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి, పొత్తుల విషయంలో దిగ్విజయ్ సింగ్ కీలక భూమిక వహించినా… మిత్రపక్షాలపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలనే ధోరణి కాంగ్రెస్ లో కనిపిస్తోంది. పొత్తుల విషయంలో అంతిమ నిర్ణయం హైకమాండ్ దే అవుతుంది కదా! ఏదేమైనా, ఆయన నిర్ణయం కొంత సంచలనమే అనాలి. మరి, బుజ్జగింపుల్లాంటివి ఏవైనా ఉంటాయేమో చూడాలి.