చాలా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలోకి ఉడుములాగ చంద్రబాబు నాయుడు వస్తున్నారని ఆరోపించారు కేసీఆర్! ఇక్కడ ఆయన అవసరం ఏముంది, వచ్చి ఏం చేస్తారు, ఆయన అవసరాన్ని ఇక్కడి ఆంధ్రులకు అంటగట్టడమేంటి అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రులు ఎప్పుడో తెలంగాణ బిడ్డలు అనీ, ఇదే మాట కొన్ని వేలసార్లు తాను చెప్పానన్నారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల తరువాత ఆంధ్రులు తమకు ఓట్లెయ్యలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడారని గుర్తుచేశారు. తాము ఎప్పుడూ అలాంటి మాటలు మాట్లాడలేదన్నారు కేసీఆర్. ఆంధ్రా నుంచి ఎప్పుడో వచ్చినవారు ఇక్కడున్నారనీ, రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు నాయకులు అయ్యారన్నారు. తాము 12 మందికి కార్పొరేటర్లుగా అవకాశం ఇచ్చి ఔన్నత్యం చాటుకున్నామనీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏడుగురికి అవకాశం ఇచ్చామన్నారు.
ఆంధ్రా నుంచి వచ్చినవారు ఎవరున్నా… మీరు ఆంధ్రా అనే భావం విడనాడాలన్నారు. తెలంగాణ పౌరులుగా భావించాలన్నారు. గడచిన నాలుగేళ్లలో ఈ సమస్యల లేదనీ, ఇప్పుడు చంద్రబాబు రావడం వల్లనే మళ్లీ వస్తుందని విమర్శించారు. ఆనందంగా అన్నదమ్ముల్లా బతికేవాళ్ల మధ్య కొర్రాయి పెట్టడానికా ఆయన వచ్చేదని ప్రశ్నించారు. తెలంగాణలోని ఆంధ్రులకు చంద్రబాబు నాయుడు శని అని కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఉద్యమ సమయంలో ఆస్తులు గుంజుకుంటారని చంద్రబాబు అండ్ గ్యాంగ్ ప్రచారం చేసిందనీ, కానీ అలాంటి ఇక్కడుందా అని కేసీఆర్ అన్నారు.
కేసీఆర్ కి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రత్యర్థిగా కనిపిస్తున్నట్టుంది! ఇప్పుడు తెలంగాణలోకి చంద్రబాబు కొత్తగా వస్తున్నట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పట్నుంచో ఇక్కడా ఉంది కదా! గులాబీ కండువా కింద ఉన్న పసుపు చొక్కాల నేతలు ఎంతమంది..? కేసీఆర్ మాటల్లోనే ఆయన పడుతున్న టెన్షన్ కనిపిస్తోంది. టీడీపీకి ఇక్కడున్న సెటిలర్స్ మద్దతు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది కేసీఆర్ ఆందోళన ద్వారా స్పష్టమౌతోంది! అందుకే.. చాలా జాగ్రత్తగా, ఒక వ్యూహం ప్రకారం… అందరూ తన వాళ్లే అనే భావజాలాన్ని మరింత బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మంచిదే, దాన్ని ఎవ్వరూ కాదనరు! తెలంగాణలో సెటిలైనవారంతా ఇక్కడి పౌరులే. కానీ, వారిని ఆకర్షించే ప్రయత్నంలో టీడీపీని దోషిగా నిలబెడుతున్న తీరు ఇక్కడ చర్చనీయాంశం! ఇంకోటి, కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు కుదురుతున్న నేపథ్యంలో… ఎప్పుడో ఉత్తమ్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్థావించడం ద్వారా… ఇక్కడి ఆంధ్రుల్లో మహా కూటమిపై ఒక రకమైన వ్యతిరేక భావనను రగల్చాలన్నది ఆయన ప్రయత్నం. ఇంతకీ… టీడీపీ మీద తెలంగాణ ప్రజలతోపాటు, సెటిలర్లలో కూడా వ్యతిరేకతను పెంచేందుకు ఇంతగా ఎందుకు ప్రయాసపడుతున్నారు..? ఇక్కడ డిపాజిట్లు కూడా టీడీపీకి రావనుకున్నప్పుడు.. ఆ పార్టీని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి..?