మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్లో అసమ్మతి మంటలు తగ్గడం లేదు. ఒక్కో నియోజక వర్గంలో ఒక్కో సమస్య ఉంది. మహబూబాబాద్ నియోజక వర్గం నుంచి టికెట్ ఆశించారు రెడ్యానాయక్ కుమార్తె కవిత. ఈమె మాజీ ఎమ్మెల్యే కూడా. హైకమాండ్ బుజ్జగించడంతో… టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్‌కు సహకరిస్తానని చెబుతున్నారు కానీ… పరిస్థితి మాత్రం అలా లేదు. అంతే కాదు.. ఉద్యమ కారులకే టికెట్ ఇవ్వాలని అసమ్మతి గళమెత్తుకున్న రవికుమార్ పార్టీ సమావేశాలకు కూడా రావడం లేదు. ఉద్యమంలో త్యాగాలు చేసిన తమకు అన్యాయం చేస్తున్నారనేది ఆయన వాదన. శంకర్ నాయక్‌ను మార్చాల్సిందేనంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ డోర్నకల్ నియోజకవర్గం నుంచి సీటు ఆశించారు. కానీ డోర్నకల్‌ను రెడ్యానాయక్‌కే కేటాయించారు. దీంతో ఆమె వర్గం.. బలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సత్యవతి రాథోడ్ మాత్రం… పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటున్నారు కానీ.. కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. ఆమె అనుచర వర్గం… రహస్య సమావేశాలు నిర్వహిస్తోంది. కేటీఆర్ వీరిని హైదరాబాద్ పిలిపించుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరూ వెనక్కి తగ్గలేదు. అయితే.. సత్యవతి రాథోడ్ అసంతృప్తి వ్యక్తం చేసినా.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా… తనకు ఏ మాత్రం నష్టం లేదని రెడ్యానాయక్ ధీమాగా ఉన్నారు. ఈ కారణంగా.. ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఒత్తిడి తెస్తున్నారు. డోర్నకల్ నియోజక వర్గంలో ఉన్న 6 మండలాలలో 4 మండలాలు సత్యవతి వర్గం నేతలు పార్టీ మారాలనే ఒత్తిడి తెస్తున్నారు.
ఇక పాలకుర్తి నియోజక వర్గంలో పాగా వేసేందుకు ఉమ్మడి జిల్లా టీఆర్ ఎస్ అధ్యక్షుడు తక్కెళ్లపళ్ళి రవిందర్ తీవ్ర ప్రయత్నాలే చేశారు. ఆయన వర్గీయులు ర్యాలీలు సమావేశాలు…నిరసనలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుకు మళ్ళీ అవకాశమివ్వడాన్ని తట్టుకోలేక పోయారు. తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్ రాక పోతే ఏకంగా రెబల్ గానైనా పోటీచేయడం ఖాయమనే సంకేతాలు అధిస్టానానికి పంపారు. చివరి క్షణంలో అయినా తమకే టిక్కెట్ ఇస్తారని కొంత మంది నేతలు.. పైకి… పార్టీ కోసం పని చేస్తున్నట్లు కనిపిస్తున్నారు కానీ.. ఎన్నికల్లో … సొంత పార్టీ అభ్యర్థికి షాకిచ్చేలా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. వీరిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో.. బుజ్జగింపుల వ్యవహారాలు చూస్తున్న కేటీఆర్ కు కూడా అర్థం కావడం లేదు.