తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… తెలంగాణలో ఏ ఏ పార్టీలు .. ఎలా పోటీ చేయాలో కూడా.. తానే నిర్ణయించాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ.. అసలు తెలంగాణలో పోటీ చేయడమే తప్పన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. ముందుగా.. తెలుగుదేశం పార్టీ.. మహాకూటమిలో చేరకూడదని.. చేరితే మూడో కన్ను తెరుస్తానని.. అస్మదీయులతో బెదిరించిన కేసీఆర్ వర్కవుట్ కాకపోడంతో.. తిట్ల దండకం అందుకున్నారు. ప్రచారసభల్లో చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు. చంద్రబాబును బూచిగా చూపి.. తెలంగాణ వాదాన్ని మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. అందిరకీ తెలిసిపోయింది. దీంతో సీమాంధ్రుల్లో ఆందోళన ప్రారంభమయింది. ప్రతి సభలోను ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అనడంతో… సెటిలర్లు అంతా టీఆర్ఎస్కు వ్యతిరేకమయ్యారనే ప్రచారం ఊపందుకుంది.
తను బహిరంగసభల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు… విద్వేష పూరిత ప్రసంగాలు చేయడమే కాక… దానికి కారణం చంద్రబాబేనని కేసీఆర్ సమర్థించుకుంటున్నారు. తాము ఆంధ్రా ప్రజలను వేరుగా చూశామా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. చిల్లర రాజకీయాల కోసం ప్రజల్లో భయాందోళనల్ని రెచ్చగొడుతున్నారని … చంద్రబాబు, ఆయన బృందం ప్రజల్లో అనేక అపోహల్ని సృష్టిస్తున్నారన్నారని విమర్శలు చేస్తున్నారు. కలసి ఉందామని.. చంద్రబాబు స్నేహహస్తం ఇచ్చారని.. కానీ “ఛీ ఛీ” ఆంధ్రోళ్లతో పొత్తులా అని తానే వద్దనుకున్నారని కేసీఆర్ బహిరంగంగానేప్రకటించారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని… కవర్ చేసుకుంటున్నారు.
తెలంగాణలో తెదేపాకు డిపాజిట్లు కూడా దక్కవని.. దేని కోసం పోటీ చేస్తున్నారని కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. డిపాజిట్లు రాని పార్టీ గురించి.. ఆ పార్టీ నేత గురించి..కేసీఆర్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు. పదే పదే ఓటుకు నోటు కేసు ప్రస్తావన తీసుకువస్తున్నారు.. మూడో కన్ను తెరుస్తానని.. కూడా హెచ్చరించారు. దానికి రియాక్షన్ కూడా రేవంత్ రెడ్డి వైపు నుంచి వచ్చింది. చంద్రబాబు రాజకీయ నాయకుడని, ఆయనను కచ్చితంగా విమర్శిస్తామని చెప్పుకుని.. మరిన్ని విమర్శలు చేశారు. తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర ప్రజల పాలిట చంద్రబాబు ఓ శని అని అనేశారు. అసలు చంద్రబాబు.. తెలంగాణ పార్టీ వ్యవహారాల్ని తెలంగాణ నేతలకే అప్పగించారు. కనీసం ప్రచారానికి రానని కూడా చెబుతున్నారు. అయినా కేసీఆర్… అసలు టీడీపీ పోటీ చేయకూడదన్నట్లుగా.. మాట్లాడుతూ.. కొంత తరహా నియంతృత్వ పోకడలు బయటపెట్టుకుంటున్నారు.