దిల్రాజు సినిమా అనగానే కథేంటో కూడా తెలుసుకోకుండా హీరోలంతా `ఓ ఎస్…` అనేస్తారు. ఎందుకంటే దిల్రాజు ప్రొడ్యూసర్లలో ఓ స్టార్. ఆయనో మేకర్. ఏ సినిమాకి ఎంత పెట్టాలో, ఎలాంటి బజ్ సృష్టించాలో ఆయనకు తెలుసు. అందుకే.. దిల్రాజు సినిమాలపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తుంటారు హీరోలు. యువ హీరోలకు ఆ సంస్థలో నటించే ఛాన్స్ వస్తే… పారితోషికం గురించి కూడా పట్టించుకోకుండా పని చేస్తారు. రామ్ కూడా అదే చేశాడు. తన కెరీర్లో తొలిసారి దిల్రాజు సంస్థలో పనిచేశాడు. `హలో గురు ప్రేమ కోసమే` ఇప్పుడు విడుదలకు కూడా సిద్ధమైంది. అయితే.. ఈ సినిమా విషయంపై, దిల్రాజు పబ్లిసిటీ స్ట్రాటజీ విషయంలోనూ రామ్ అసంతృప్తిగా ఉన్నాడని టాక్.
పండగ రోజున `హలో గురూ..` విడుదల అవుతోంది. ఓ విధంగా ఈసినిమాకి అదే ప్లస్. కాకపోతే.. బరిలో `అరవింద సమేత` ఇంకా వీర విహారం చేస్తూనే ఉంది. ఓ రకంగా… రామ్ ఈ పరిస్థితిలో బాక్సాఫీసుని మెప్పించడం అంత సులభం కాదు. పైగా రామ్ గత చిత్రం `ఉన్నది ఒకటే జిందగీ` బాక్సాఫీసుని పెద్దగా మెప్పించలేకపోయింది. దిల్రాజు `కల్యాణ వైభోగం` కూడా డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. ఈ దశలో.. ప్రమోషన్లు భారీగా చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎప్పుడూ స్రవంతి మూవీస్ రామ్కి అండగా నిలిచేది. ప్రమోషన్ విషయంలో తన ప్లానింగ్ తనకు ఉండేది. దాదాపుగా తన సూచనల మేరకే తన సినిమాల పనులన్నీ జరిగేవి. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా దిల్ రాజు చేతిలోకి వెళ్లిపోయింది. దాంతో రామ్.. ఆలోచనలు, ప్లానింగులు ఏమీ వర్కవుట్ కావడం లేదు. అన్నిటికి మించి.. విడుదలకు ముందే రావల్సిన బజ్ ఈ సినిమాకి రాలేదు. ఈ విషయంలోనూ రామ్ అసంతృప్తితో ఉన్నట్టు టాక్. రేపు ఈ సినిమా విడుదలై.. హిట్టయితే – ఈ లోటేం పెద్దగా కనిపించకపోవొచ్చు. టాక్ బాగున్నా వసూళ్లు అంతంత మాత్రంగా ఉంటే – కచ్చితంగా పబ్లిసిటీ ఓ లోపమైపోతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.