పండగ వస్తుంటే… కొత్త సినిమాల హంగామా మొదలైపోతుంది. థియేటర్ల ముందు కొత్త పోస్టర్లు కనిపిస్తాయి. దానికి తోడు ఫస్ట్ లుక్, టీజర్ల సంగతైతే ఇక చెప్పక్కర్లెద్దు. దసరాకి ఈ హంగామా మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే… దసరా అనేది చిత్రసీమకు ఓ సెంటిమెంట్. దసరా రోజున కొత్త సినిమాలు మొదలవుతాయి. కొత్త సినిమాల టీజర్ల విడుదల, టైటిళ్ల ప్రకటన, లుక్కులు చూపించడం ఇది దసరాకే ఎక్కువ. ఈసారీ.. ఈ హడావుడి కనిపించబోతోంది,
రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన `వినయ విధేయ రామ` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ టైటిల్‌ని దసరా సందర్భంగా ప్రకటించే అవకాశం ఉంది. రామ్ చరణ్ లుక్‌ని కూడా ఆ రోజే రివీల్ చేయొచ్చు. ప్రభాస్ కూడా పండగ బహుమతి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. `సాహో`కి సంబంధించిన సరికొత్త లుక్ గానీ, టీజర్ గానీ దసరా రోజున విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి సంబంధించిన టైటిల్ కూడా పండగ రోజున ప్రకటించే అవకాశాలున్నాయి. `ఎన్టీఆర్` బయోపిక్‌కి సంబంధించి ఇప్పటికే కొన్ని లుక్‌లు బయటకు వచ్చాయి. ఈసారి పండక్కి హరికృష్ణగా కల్యాణ్ రామ్ లుక్‌ని చూపిస్తారని టాక్. ఇటీవల కళ్యాణ్ రామ్ సెట్లోకి వెళ్లారు. ఆయనపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ సందర్భంగా చిత్రబృందం ఓ ఫొటోని కూడా విడుదల చేసింది. అందులో కల్యాణ్‌రామ్ అటువైపు తిరిగి ఉన్నారు. ఈసారి పూర్తి లుక్ బయటకు వదలబోతోంది చిత్రబృందం. చిరంజీవి 151వ చిత్రం `సైరా`కి సంబంధించి కూడా మెగా అభిమానులు ఓ లుక్ ఆశిస్తున్నారు. అయితే.. చిత్రబృందం ఇందుకు సంబంధించి ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఎలాగూ చరణ్ లుక్ ఉండబోతోంది కదా అని `సైరా`ని పక్కన పెట్టినా పెట్టొచ్చు.
మహేష్ బాబు కొత్త సినిమా `మహర్షి`కి సంబంధించి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా పండగ రోజునే ఉండబోతోందని చిత్ర వర్గాల సమాచారం. `ఎఫ్ 2`, `అంతరిక్షం`… వీటికి సంబంధించి కొత్త విశేషాలు, కొత్త లుక్కులు పంగ రోజున బయటకు వచ్చే ఛాన్సులున్నాయి. ఈసారి దసరా.. మరింత వినోదాలు పంచబోతోందన్న మాట.