దేశవ్యాప్తంగా ఇంతకంటే గొప్ప పథకం లేదన్నారు! ఇతర రాష్ట్రాలు తమను ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడులు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తమదే అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఘనంగా చెప్పుకున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో ఎకరాకి నాలుగు వేలు చొప్పున చెక్కుల పంపిణీ కూడా జరిగిపోయింది. ఈ పథకం ఎన్నికల్లో మంచి మైలేజ్ తీసుకొచ్చేదిగా ఉంటుందని కేసీఆర్ భావించారు. ఇతర హామీలు, పథకాల అమల్లో వెనకబాటు, వైఫల్యాలు.. ఇవేవీ కనిపించకుండా ఎకరాకి నాలుగు వేలు చొప్పున చెక్కులు చేతిలో పెట్టేయడం ద్వారా అంతా కప్పేస్తుందని ఆశించారు! కానీ, ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వాస్తవాలు ఒక్కోటీ కేసీఆర్ కి తెలిసొస్తున్న పరిస్థితి. అందుకే, ఉన్నట్టుండి వరాల హామీలూ మళ్లీ కురిపిస్తున్నారు. ఇప్పుడున్న ఎకరాకి రూ. నాలువేలను మరో వెయ్యి పెంచుతామని కూడా తాజాగా ఇచ్చిన హామీల జాబితాలో ఒకటుంది. అంత ప్రజాకర్షక పథకమే అయితే.. మరో వెయ్యి పెంచుతామంటూ కొత్తగా హామీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది..?
తెలంగాణలో రాజకీయ పరిస్థితిపై తాజాగా ఢిల్లీకి చెందిన ఓ సంస్థ సర్వే చేసింది. రాబోయే ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంటూ లెక్కగట్టారు. ఇక, చాలా గొప్ప అంటూ చెప్పిన రైతుబంధు పథకం అమలుపై కూడా సర్వేలో భాగంగా అభిప్రాయాన్ని సేకరించినట్టు సమాచారం. రైతుబంధు రైతులకు ఏ మేరకు ఉపయోగపడింది, కేసీఆర్ సర్కారు ఇచ్చిన పెట్టుబడి వారి జీవితాల్లో ఏమేరకు సమూల మార్పులను తీసుకొచ్చిందనే అంశంపై కొంతమంది రైతుల దగ్గర అభిప్రాయాలు సేకరించారు. అయితే, దాదాపు 80 శాతానికిపైగా రైతులు ఈ పథకంపై పెదవి విరిచారట..! దీని వల్ల పెద్దగా ఉపయోగం లేదనే అనేవారు ఎక్కువగా ఉండటం విశేషం. అంతేకాదు, అందుకున్న చెక్కులను చిల్లర ఖర్చులకు, ఇంట్లో ఇతర అవసరాలకే సరిపోలేదని చెప్పేవారు ఎక్కువ ఉన్నారు. ఇదే తరహా నివేదికలు కేసీఆర్ చేయించుకున్న సొంత సర్వేల్లో కూడా వెల్లడైనట్టూ ఈ మధ్య కథనాలు వినిపిస్తున్నాయి కదా!
నిజానికి, రైతుబంధు పథకం వల్ల కౌలు రైతులకు ఏ ఉపయోగం లేకపోవడం కూడా పెద్ద మైనస్ అయింది..! వాస్తవానికి, వ్యవసాయ క్షేత్రంలో ఉండేదీ, చెమటోడ్చి పనిచేసేదే వారే. ఈ పథకం పరిధిలోకి వారు రాకపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు. పోనీ, లబ్ధి పొందినవారైనా సంతృప్తిగా ఉన్నారూ, కేసీఆర్ సర్కారు నిర్ణయంతో సంతోషంగా ఉన్నారంటే.. అదీ అరకొరగానే కనిపిస్తోంది. ఈ ఒక్క పథకం చాలు… ఎన్నికలు గట్టెక్కెయ్యొచ్చు అనుకున్న కేసీఆర్ కి, ఇప్పుడు అదనపు వరాలు అంటూ కొత్త హామీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది..! సో.. ఈ పథకం కూడా తెరాసకు పెద్దగా మైలేజ్ ఇచ్చే దాఖలాలు అయితే తక్కువగానే ఉన్నాయి.