అరుకు ఘటనతో అనూహ్యంగా మావోయిస్టులు బెడద మరోసారి తెరమీదికి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలు సమీపిస్తుండటంతో పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా మావోయిస్టుల కార్యకలాపాలపై నిఘా వర్గాలు కన్నేసి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికల్ని నిరసిస్తూ మావోయిస్టులు తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషన్ పేరుతో ఒక బహిరంగ లేఖ బయటకి వచ్చింది. తెలంగాణలో జరగబోతున్న ముందస్తు ఎన్నికల్ని నిరసిస్తున్నట్టు ఈ లేఖలో పేర్కొన్నారు.
త్వరలో జరగబోతున్నవి బూటకపు ఎన్నికలనీ, వీటిని ప్రజలంతా బహిష్కరించాలని మావోయిస్టులు లేఖ ద్వారా పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కారు రాష్ట్రాన్ని దోచేస్తోందనీ, అన్ని వర్గాలనూ అణచివేస్తోందనీ, ఈ తీరుపై తిరగబడి పోరాడాలంటూ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కేసీఆర్ సర్కారు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరామ్ స్థాపించిన తెలంగాణ జన సమితి పార్టీ కూడా అవకాశవాద రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందనీ, వారి పోరాటంలోనూ చిత్తశుద్ధి లేదని నిరసించింది. కాంగ్రెస్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పక్షాలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం ప్రజలంతా పోరాడాలంటూ ఈ లేఖలో పేర్కొన్నారు.
నిజానికి, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో కూడా కవ్వింపు చర్యలు ఏవైనా ఉండొచ్చనే అనుమానాలను కొద్ది రోజుల కిందటే నిఘా వర్గాలు వ్యక్తం చేసినట్టు కథనాలొచ్చాయి. ముందుగా ఛత్తీస్ గఢ్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, అక్కడ మావోయిస్టుల ప్రభావం కొంత ఉంటుందనే అనుమానాలూ ఉన్నాయి. ఆ తరువాత, తెలంగాణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి… ఇటువైపు కూడా వారి కన్ను ఉంటుందనే అంచనాలూ ఉన్నాయి! దీంతో ఇప్పటికే ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పెంచినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారానికి మారుమూల ప్రాంతాలకు వెళ్లే ముందుకు తమకు సమాచారం ఇవ్వాలంటూ అన్ని పార్టీలకూ పోలీసులు సూచించినట్టు సమాచారం. ఇక, తాజా లేఖ నేపథ్యంలో మరింత అప్రమత్తం కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏకంగా ఎన్నికలనే బహిష్కరించాలని ముందుగానే పిలుపునివ్వడంతో కొంత టెన్షన్ అయితే పెరుగుతుందనే చెప్పొచ్చు.