అంతరిక్షం, గ్రహాలు, ఉపగ్రహాలు, చంద్రమండలం… ఇవన్నీ మనం టచ్ చేయలేని కథలు. సైన్స్‌ని కథలో భాగంగా తెలుగు సినిమా ఎప్పుడూ వాడుకోలేదు. దానికి గల కారణం ఇక్కడి ప్రేక్షకుల అభిరుచే. మాస్, కమర్షియల్ అంశాలుంటే.. వర్కవుట్ అయిపోతుందిలే… అనుకుంటూ వాటి చుట్టూనే సినిమాలు తిప్పేవారు. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. వరల్డ్ సినిమాని మనవాళ్లూ ఆస్వాదిస్తున్నారు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కథల ఎంపికలోనూ మార్పు వచ్చింది. ఆ మార్పులో భాగమే `అంతరిక్షం`లాంటి చిత్రాలు. ఘాజీతో తొలి అడుగులోనే తానేంటో నిరూపించుకున్నాడు సంకల్ప్‌రెడ్డి. తన నుంచి వస్తున్న మరో ప్రయోగం, ప్రయత్నం…. అంతరిక్షం. పేరుకి తగ్గట్టే… అంతరిక్షం నేపథ్యంలో జరిగే కథ ఇది. టీజర్నీ అలానే కత్తిరించారు. హ్యోమగాములు, వాళ్ల ప్రయోగాలు, అంతరిక్షం… మన దేశానికి ముంచుకొచ్చే ఓ ముప్పు.. వీటి చుట్టూ కథ సాగుతుందని టీజర్లో తేలిపోయింది. హాలీవుడ్ చిత్రం ఇంటర్ స్టల్లర్ లా… సినిమా అంతా స్పేస్‌లోనే ఉంటుందా? లేదంటే కొంత భూమ్మీద, ఇంకొంత అంతరిక్షంలోనూ జరుగుతుందా? అనేదే తేలాల్సిన ప్రశ్న. ఈ సినిమా ఎలా ఉండబోతోంది? హాలీవుడ్ స్థాయిని అందుకుంటుందా? లేదా? మన ప్రేక్షకులకు అర్థం అవుతుందా, కాదా? అనే అనుమానాల్ని పక్కన పెట్టి.. ఈప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిన తరుణమిది. రేపటి అద్భుతాలకు అంతరిక్షం.. ఓ అంకురార్పణ కావొచ్చు.