మల్టీస్టారర్ సినిమాలు చేయరు.. చేయరు అంటుంటారు గానీ, అదో తలనొప్పి వ్యవహారం. ఇద్దరు హీరోల ఈగోల్ని సంతృప్తి పరచడం చాలా కష్టం. అందునా స్టార్లయితే మరీ కష్టం. ఆ కష్టాలెలాంటివో ‘దేవదాస్‌తో’ శ్రీరామ్ ఆదిత్యకు తెలిసొచ్చింది. ఈ సినిమాతో శ్రీరామ్ తెగ ఇబ్బంది పడ్డాడన్నది ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఇద్దరు హీరోలఈగోల్ని సంతృప్తి పరచడానికి చాలా కష్టపడ్డాడని, ఎడిట్ రూమ్ లో శ్రీరామ్ ఆదిత్య బాధ వర్ణనాతీతమని ఈ సినిమాకి పనిచేసిన అత్యంత కీలకమైన ఓ వ్యక్తి సమాచారం అందించాడు. అదే నిజమన్నది పరిశ్రమ వర్గాలు కూడా చెప్పేమాట. నాగ్ చాలా సార్లు శ్రీరామ్‌పై కోపం ప్రదర్శించేవాడని, నాని కూడా తన ‘సీనియారిటీ’ చూపించాడని టాక్. ‘దేవదాస్’ ప్రెస్ మీట్లో కూడా శ్రీరామ్ ఆదిత్యపై `బద్దకస్తుడు` అనే ముద్ర వేసేశారు వీరిద్దరూ.
నాని సంగతేమో గానీ… నాగ్ మాత్రం మరోసారి బయటపడిపోయాడు. అయితే ఈసారి నిజాయతీగా నిజం ఒప్పుకున్నాడు. శ్రీరామ్ ఆదిత్యపై చాలా సార్లు కోపం తెచ్చుకున్నానని, అయితే ఎక్కడా తొణకకుండా ఈ సినిమాని పూర్తి చేశాడని, భవిష్యత్తులో తాను అద్భుతాలు సృష్టిస్తాడని కితాబు ఇచ్చేశాడు నాగ్. కథానాయకులకు ఈగోలు ఉంటాయని, అది తమ బర్త్ రైట్ అనుకుంటామని, అందుకే కొన్ని సార్లు… రూడ్‌గా ప్రవర్తించాల్సివస్తుందని… శ్రీరామ్ ఆదిత్యపై కూడా అదే జరిగిందని – కుండ బద్దలు కొట్టేశాడు. మొత్తానికి తెర వెనుక ఏదో జరిగిందన్న ప్రచారానికి నాగ్ మాటలు మరింత బలాన్ని ఇచ్చాయి. సినిమా ఈ మాత్రం నిలదొక్కుకుంది కాబట్టి… అప్పుడు కోపం తెచ్చుకున్నా, ఇప్పుడు ఆ నిజం ఒప్పుకోగలిగాడు నాగ్. అదే… ఈమాత్రం వసూళ్లు కూడా లేకపోతే.. శ్రీరామ్ పరిస్థితి ఏమయ్యేదో..??