‘ప్రయోగాలు చేయాలనివుంది’ అనే రామ్ కొత్త స్టేట్మెంట్ కొంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే రామ్ ఇన్నేళ్ల కెరీర్లో ప్రయోగాలు చేసింది లేదు. కొత్తగా ట్రై చేసింది లేదు. ‘దేవదాస్’ హిట్టవ్వడంతో మాస్ మంత్రం జపించాడు. అక్కడి నుంచి ఆ తరహా కథలే ఎంచుకున్నాడు. హిట్లు కూడా దక్కాయి. అయితే ఒక్కసారిగా కెరీర్ అయోమయంలో పడిపోయింది. చేసిన సినిమాలు, పడిన కష్టం సరైన ఫలితాల్ని ఇవ్వలేకపోయాయి. ‘నేను శైలజ’తో లవ్ ట్రాక్ ఎక్కాడు రామ్. అది కాస్త ఫలితాన్నిచ్చింది. ‘ఉన్నది ఒకటే జిందగీ’ మళ్లీ బెడసి కొట్టింది. అయినా సరే – ‘హలో గురు ప్రేమ కోసమే’తో మళ్లీ లవ్ స్టోరీనే నమ్ముకున్నాడు.
లవ్ స్టోరీ ఓ రకంగా సేఫ్ జోనర్. యూత్‌ని ఆకట్టుకుంటే చాలు. రొటీన్ లవ్ స్టోరీలలైనా సరే, ట్రీట్మెంట్ కాస్త కొత్తగా ఉంటే.. వర్కవుట్ అయిపోతుంటాయి. అందుకే రామ్ ప్రస్తుతం ప్రేమ కథలవైపు దృష్టి పెడుతున్నాడు. సేఫ్జోనర్ని వదిలి బయటకు రాలేని రామ్. ‘రంగస్థలం, మహానటి లాంటి సినిమాలు చేయాలనివుంది’ అని చెప్పడం ఆశ్చర్యమే. నిజానికి ప్రయోగాలు, కొత్త తరహా సినిమాలు చేయాల్సిన సమయంలోనే.. రామ్ రిస్క్ తీసుకోలేదు. రొటీన్ ఫార్ములా కథలకు, మాస్ పాత్రలకు ఫిక్సయిపోయాడు. ఇప్పుడు యూత్ హీరోల జోరు ఎక్కువైంది. వాళ్లంతా సూపర్ హిట్లతో దూసుకుపోతున్నారు. విజయ్ దేవరకొండలాంటివాళ్లయితే ఒకట్రెండు సినిమాలకు స్టార్ అయిపోతున్నారు. ఈ దశలో రెండు ఫ్లాపులు పడితే అంతే సంగతులు. ఇప్పుడు.. రిస్క్ తీసుకోవడం ఇంకా పెద్ద రిస్క్. అందుకే రామ్ తెలివిగా ఇలాంటి సేఫ్ జోనర్‌ని ఎంచుకున్నాడు. రామ్ మంచి నటుడు. అతని ఎనర్జీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే అదంతా కొన్ని పాత్రలకే పరిమితం అయిపోవడం ఒక్కటేలోటు. రామ్‌లోని కొత్త కోణం బయటకు రావాలంటే కచ్చితంగా కొత్త తరహా పాత్రలు, ప్రయోగాలు చేయాల్సిందే. మరి అలాంటి కథలు రామ్‌కి వస్తాయా ? వచ్చినా చేసేంత ధైర్యం రామ్‌కి ఉందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.