శబరిమల దేవాలయం తెరవడంతో దేశమంతా అటువైపు చూసింది..! ఎందుకంటే, మహిళలు ఆలయంలో ప్రవేశించొచ్చు అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇది కొన్ని దశాబ్దాలుగా ఒక దేవాలయం పాటిస్తున్న ఆచారవ్యవహారలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోర్టు తీర్పు నేపథ్యంలో వచ్చే మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కేరళ ప్రభుత్వం చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆలయం ద్వారాలు తెరుచుకున్నా.. మహిళా భక్తులను అనుమతించని పరిస్థితే కనిపించింది..! ఎక్కడికక్కడ నిరసనకారులు అడ్డుకున్నారు.
నిజానికి, సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత త్రివేండ్రంతోపాటు కేరళలలో కొన్ని చోట్ల భారీ ర్యాలీలు మహిళలే నిర్వహించి, ఆలయ ఆచార సంప్రదాయలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని స్పష్టం చేయడంతో ఈ అంశానికి ప్రాధాన్యత వచ్చింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లో మహిళల్ని అడ్డుకుంటామంటూ భాజపాతోపాటు కొన్ని అనుబంధ సంస్థలు నిరసనలకు దిగాయి. దీంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చెయ్యాల్సిన ఏర్పాట్లూ చేసింది. ఏదెలా ఉన్నా మహిళల్ని వెళ్లకుండా ఆందోళనకారులు నియంత్రించారనే చెప్పొచ్చు. ఇంకోపక్క, అక్కడి పరిస్థితులు కూడా ఇలా ఉండటంతో… ఇలాంటప్పుడు వెళ్లడం ఎందుకు అనుకుని ఆగిపోయివారు కూడా చాలామంది ఉన్నారు. దీంతో మరో నాలుగు రోజులపాటు ఆలయం తెరిచి ఉన్నా కూడా.. మహిళా భక్తుల ప్రవేశంపై అనుమానాలే వ్యక్తమౌతున్నాయి.
పూజారులు కూడా మహిళల ప్రవేశం విషయమై వ్యతిరేకంగా ఉన్నారు. దీంతోపాటు, ప్రతీయేటా తాంత్రీగా పూజలు నిర్వహించే రాజ కుటుంబం కూడా వ్యతిరేకిస్తూనే ఉంది. తరాలుగా వస్తున్న నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలో ఇలాంటివి చోటు చేసుకుంటే… తాము పూజలు చెయ్యమని కూడా వారు అంటున్న పరిస్థితి..!
ఈ అంశంపై దేవస్థానం బోర్డు సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ వేయడానికి సిద్ధమౌతున్నట్టు సమాచారం. దీంతోపాటు కేంద్రం నుంచి కూడా ఏదైనా చర్యలకు ఆస్కారం ఉందా లేదా అనేది కూడా పరిశీలిస్తామని బోర్డు అంటోంది. తమిళనాడులో జల్లికట్టు నిషేధం తరువాత పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడం, అదో సంప్రదాయం అంటూ ఆందోళనలు పెరిగిన క్రమంలో కేంద్రం నుంచి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కదా! అదే తరహాలో శబరిమల ఆలయం విషయంలో సుప్రీం వెలువరించిన తీర్పుపై కూడా ఇలాంటి మార్గాలు ఏవైనా ఉన్నాయేమో అనేది కూడా చూస్తున్నట్టు సమాచారం. మహిళలకు అన్నింటా సమ ప్రాధాన్యత దక్కాలన్నదాన్ని ఎవ్వరూ కాదనరు. కానీ, ఈ అంశంలో ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు వంటివి ఎక్కువగా డామినేట్ చేస్తుండటంతో విషయం ఇలా మారింది.