నిర్మల్ జిల్లాల రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిర్మల్ లో ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి పరిస్థితులు కలసి రావడం లేదు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తనతో పాటు మరో 19మంది కౌన్సిలర్‌ను కూడగట్టుకొని టీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఈ వ్యవహారం అక్కడి రాజకీయాలను కుదిపేసింది. ఎన్నికల సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గణేష్ రాజీనామా అంశాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపడమే కాకుండా గణేష్ వెళ్లిపోతే నష్టం లేదని… చెప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి పరిణామాలు సహజమేనని ఎవరు కూడా మనో ధైర్యం కోల్పోవద్దంటూ ఇంద్రకరణ్ రెడ్డి కేడర్‌కు చెబుతున్నారు.
గణేష్ చేరిక వ్యవహారంతో పాటు రాహుల్‌గాంధీ పర్యటనను తనకు అనుకూలంగా మార్చుకోని గెలుపును సునాయసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే చేరికలు పెరిగిపోవడం, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తితో పాటు మరో 19 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడంతో ఆపార్టీలో జోరు పెరిగింది. పట్టణంలో గట్టిపట్టున్న నేతగా పేరున్న గణేష్ రాకతో పార్టీలో ఉత్సాహం నెలకొనడమే కాకుండా గెలుపు ధీమా రెట్టింపయ్యిందంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలేటీ మహేశ్వర్ రెడ్డి వ్యూహత్మకంగా వ్యవహారిస్తూ ప్రతి అంశాన్ని పార్టీకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వ్యూహంలో భాగంగానే గణేష్ చేరిక వ్యవహారం జరిగిందంటున్నారు.
దీని ప్రభావం మిగతా సెగ్మెంట్లకు కూడా విస్తరింపజేయాలని భావిస్తోంది. ముథోల్ సెగ్మెంట్లో టీఆర్ఎస్ అభ్యర్థిత్వం విషయంలో ఎదురవుతున్న అవరోధాలను అధిగమించేందుకు ప్రయత్నిస్తుండగా ఖానాపూర్ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిత్వాలపై సందిగ్దతకు తెరదించే ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం టికెట్ రాని ఆశావహులందరిని సమన్వయ పరిచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ముథోల్ టిఆర్ఎస్లో అభ్యర్థిత్వ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఆ పార్టీ అభ్యర్థి విఠల్ రెడ్డిని తప్పించాలని వేణుగోపాలచారి వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈవ్యవహారం టీఆర్ఎస్కు తలనొప్పిగా మారింది. ఇక్కడి కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. భైంసాలో ఈనెల 20న నిర్వహించబోతున్న ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ బహిరంగ సభను విజయవంతం చేసి జిల్లా పార్టీలో కొత్త ఊపును నింపాలని కాంగ్రెస్ యోచిస్తుంది. ముథోల్, ఖానాపూర్ సెగ్మెంట్లో పార్టీ అభ్యర్థిత్వాలపై వివాదం తలెత్తకుండా నేతలు, కార్యకర్తలు చేజారకుండా చూసేందుకు రాహుల్ సభను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారు.