ముందస్తు ఎన్నికలకు వెళ్లే విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు.. బీజేపీ పెద్దల నుంచి అందిన సహకారం అంతా ఇంతా కాదు. తన మూడో కంటికి కూడా తెలియకుండా కేసీఆర్.. కేంద్రం, గవర్నర్‌తో మొత్తం చక్క బెట్టుకుని… ముందస్తు ఎన్నికలు తెచ్చుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటాయేమో అన్న ఉద్దేశంతో… వెనుక బడిన జిల్లాలకు.. ఇవ్వాల్సిన రూ. 450 కోట్లను ఉన్న పళంగా విడుదల చేశారు. నిధులు విడుదల చేసిన.. వారం తర్వాత తీరిగ్గా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకూ.. ఎందుకు ఇవ్వలేదంటే.. ఎలాంటి యూసీలు కేంద్రం నుంచి రాలేదు. వేటికి ఖర్చు పెట్టారో తెలియదు..! అందుకే ఇవ్వలేదు. ఈ నిధులు ఏపీ అకౌంట్లో వేసి వెనక్కి తీసుకున్నారు. మళ్లీ ఇవ్వలేదు. యూసీల కారణమే చెబుతున్నారు. కానీ ఏపీ మాత్రం కేంద్రం ఆ విధంగా అధికారిక ప్రకటన చేయాలని సవాల్ చేస్తోంది. కానీ మోడీ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదు.
అయితే ఇప్పుడు హఠాత్తుగా… తాము ఇచ్చిన నిధులను వెనక్కి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు హుకుం లాంటి లేఖ రాసింది. అయితే.. ఈ నిధులు.. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చినవి కావు. ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చినవి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలుగు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఇళ్లను కేటాయించింది కేంద్రం. ఆ కేటగిరి కింద.. రాష్ట్ర ప్రభుత్వం కొంత.. కేంద్రం కొంత.. సబ్సిడీ ఇచ్చి.. పేదలకు ఇళ్లను నిర్మించాలి. ఏపీలో.. ఇప్పటికే ఆరేడు లక్షల ఇళ్లు నిర్మించి గృహప్రవేశాలు చేయించామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఇళ్లలో అవినీతి జరిగిందని బీజేపీ చెబుతోంది. అది వేరే విషయం. కానీ తెలంగాణలో.. అలా కేటాయించిన ఇళ్లలో ఒక్కటంటే.. ఒక్కటి కూడా కట్టలేదు. తెలంగాణకు గత సంవత్సరం కోటాలో 70,674 ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. దీనికి సంబంధించి రూ. 190.78 కోట్లను తెలంగాణకు విడుదల చేసింది. ఎన్ని ఇళ్లు కట్టారో చెప్పాలంటూ.. ఎప్పటికప్పుడు.. కేంద్రం ఆరా తీస్తోంది. కానీ అసలు సమాచారమే పంపడంలేదు. అసలు కడితే కదా.. పంపడానికి అనేది.. తెలంగాణ అధికావర్గాల వాదన. మరి ఆ నిధుల్ని ఏం చేశారు..? ఒక్క ఇల్లూ కట్ట లేదు, యూసీలు లేవు, ఇళ్ల ప్రొగ్రెస్‌పై రిపోర్టు లేదు, వెబ్ సైటులో వివరాలు పెట్డడం లేదు. దీంతో కేంద్రం… ప్రతి పదిహేను రోజులకోసారి.. తెలంగాణకు గుర్తు చేస్తూనే ఉంది. కానీ స్పందించలేదు.
కేంద్రం ఆర్థిక సాయంతో కట్టే ఇళ్లు తమకు వద్దని కేసీఆర్ చెబుతున్న విషయం కేంద్రం దృష్టికి వెళ్లింది. తెలంగాణ డబుల్ బెడ్రూం స్కీం పెట్టారని… ఆ డబుల్ బెడ్రూం ఇళ్లు ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన రూల్స్‌తో సాధ్యం కావని వాటిని అలాగే వదిలేశారని తెలంగాణ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మరి తెలంగాణ ప్రభుత్వమే ఇళ్లు కట్టించాలనుకున్నప్పుడు.. తాము ఇచ్చిన డబ్బులు ఉంచుకోవడం ఏమిటన్న సందేహం కేంద్రానికి వచ్చంది. ఖర్చు లెక్కలు చూపించాలి కాబట్టి.. ఉన్న పళంగా కేంద్రం ఇక ఆ డబ్బు వాపస్ పంపించాలని నోటీసు పంపింది. దీనికి స్పందిస్తే కేసీఆర్ ఎందుకవుతారు..? . ఆయన నోటీసును చెత్తబుట్టలో పడేశారు. మరి ఏం జరుగుతుందో..?