గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్. వొహ్రా జెండా ఎగురవేసి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ రాష్ట్రంలో ఇదివరకు అధికారంలో ఉన్న పిడిపి-బీజేపీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆ రెండు పార్టీల మధ్య కొన్ని అంశాలపై ప్రతిష్టంభన ఏర్పడినందున పిడిపి అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఆ కారణంగా రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించడం చేత నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జెండా ఎగురవేసి ఆ కార్యక్రమాలలో పాల్గొనవలసి వచ్చింది. అదేమీ తప్పు కాకపోయినప్పటికీ, రెండు రాజకీయ పార్టీల పంతాల కారణంగా, సుమారు నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్లే భావించవచ్చును. ఒకవేళ ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి, ఆసక్తి లేనట్లయితే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా రాష్ట్రపతి పాలన విధించి ఉంటే ఇటువంటి విమర్శలకు తావుండేది కాదు.
తన తండ్రి అడుగుజాడలలోనే తాను కూడా నడుస్తానని చెపుతున్న మహబూబా ముఫ్తీ, తమ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్న బీజేపీకి అనేక షరతులు విధిస్తోంది. చివరకి పాకిస్తాన్ తో భారత్ ఎటువంటి విధానం అవలంభించాలో కూడా ఆమె నిర్దేశిస్తున్నారు. అలాగే బీజేపీ కూడా అధికారం పంచుకొనే విషయంలో పిడిపికి కొన్ని షరతులు విధిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్ వంటి దేశానికి ఆనుకొని ఉన్న సరిహద్దు రాష్ట్రమయిన జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడూ కూడా పరిస్థితులు సమస్యాత్మకంగానే ఉంటాయి. అటువంటి చోట బలమయిన ప్రభుత్వం కలిగి ఉండటం అత్యవసరం. కానీ రెండు పార్టీలు తమ రాజకీయ అవసరాలు, ప్రయోజనాలనే చూసుకొంటున్నాయి తప్ప రాష్ట్ర పరిస్థితులను, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవడం లేదనిపిస్తోంది. రాష్ట్రంలో గవర్నర్ పాలన ఇంకా ఎంత కాలం సాగుతుందో తెలియదు కానీ రాష్ట్రంలో ఏదయినా అవాంచనీయ సంఘటనలు జరిగితే అందుకు ఆ రెండు పార్టీలదే బాధ్యత అవుతుంది.