ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. 2009లో ఆవిర్భవించిన వైరా స్థానాన్ని తమకే కేటాయించాలని మహాకూటమిలోని అన్ని పార్టీలు పట్టుబడుతున్నాయి. చివరకు తమకు ఈ స్థానం ఇవ్వకుంటే రాష్ట్ర స్థాయి పొత్తులైనా వదులుకుంటామనే సంకేతాలు రోడ్‌షోల వేదికగా కూటమిలోని పార్టీలు చేస్తున్నాయి. వైరా నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీకి ప్రత్యర్థిగా జతకట్టిన మహాకూటమి నుంచి ఇక్కడ పోటీ చేసేది ఎవరో ఇప్పటివరకు స్పష్టత కాలేదు. గిరిజన నియోజకవర్గంగా ఉన్న వైరా 2009లో ఆవిర్భవించింది. అప్పటి సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా, సీపీఎం మద్దతుతో సీపీఐ పోటీ చేయగా కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేసింది. అప్పట్లో సీపీఐ అభ్యర్థిగా బాణోత్ చంద్రావతి విజయం సాధించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎం మద్దతుతో వైసీపీ పోటీ చేసింది. కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ పోటీ చేసింది. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. చివరికి వైసీపీ అభ్యర్థి గెలిచారు. ఆయన టీఆర్ఎస్ల చేరిపోయారు.
కూటమి పార్టీల మధ్య వైరా స్థానం దక్కించుకునే అంశంపై కాంగ్రెస్, సీపీఐ మధ్య తారస్థాయి పోరు నడుస్తుంది. ఈ సీటు తమదేనని తమకు కేటాయించాల్సిందేనంటూ సీపీఐ ఇప్పటికే గట్టి పట్టుపడుతుంది. కానీ సీపీఐకి ఇచ్చేందుకు కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ నుంచి విముఖత వస్తోంది. దీంతో సీపీఐ వైరాలో బలప్రదర్శన నిర్వహిస్తోంది. పార్టీ సీనియర్ నాయకుడు కూనంనేని సాంబశివరావు ఈ స్థానాన్ని తమకు కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ముందస్తు రాకముందు నుంచే వైరాలో తాము పోటీ చేస్తామంటూ కాంగ్రెస్ శ్రేణులు బలమైన సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించడంతో పాటు గాంధీభవన్ వద్ద నిరసన తెలిపి వైరా స్థానాన్ని కాంగ్రెస్ వదులుకోకూడదంటూ పార్టీ పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.
గతంలో ఇది తమ సిట్టింగ్ స్థానమని తమకు బలముందని తప్పకుండా విజయం సాధిస్తామంటూ సీపీఐ వాదిస్తుంది. కాంగ్రెస్ ఇందుకు భిన్నంగా తామే అధికార పార్టీని ఢీకొనగలమని, తాము పోటీ చేస్తేనే విజయం తథ్యమనే సంకేతాలు పార్టీ అధిష్ఠానానికి పంపిస్తున్నారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, ప్రస్తుత ఎన్నికలకు ప్రచారకమిటీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన మల్లు భట్టి విక్రమార్క సొంత మండలం వైరా కావడంతో ఆయన కూడా.. కాంగ్రెస్ పార్టీనే పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ స్థానం కోసం మహాకూటమి పొత్తులనే ప్రభావితం చేస్తామనే సంకేతాలను సీపీఐ ఇస్తోంది.