ఏ సినిమాకైనా పబ్లిసిటీ చాలా ముఖ్యం. దానితోనే జయాపజయాలు ముడిపడి ఉంటాయి. అందుకే ప్రెస్ మీట్లు, థ్యాంక్స్ మీట్లు, సక్సెస్ మీట్లూ అంటూ హడావుడి చేస్తుంటారు. `దేవదాస్`కి ఇలాంటి హడావుడి కాస్త ఎక్కువగానే జరిగింది. అశ్వనీదత్ సినిమా కదా.. అందుకే ఈ ప్రమోషన్లు కాస్త భారీగా నిర్వహించారు. అయితే.. ఇటీవల మూడో సక్సెస్ మీట్ ఒకటి జరిగింది. దానికి నాగార్జున, నాని వచ్చారు కూడా. సక్సెస్ మీట్ అంటే ఒకటే జరుగుతుంది. అది.. సినిమా విడుదలైన రెండో రోజో, మూడో రోజో నిర్వహిస్తుంటారు. దేవదాస్‌కీ అలాంటి సక్సెస్‌మీట్ ఒకటి జరిగింది. నోటా విడుదల రోజున మరో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తరవాత అరవింద సమేత కూడా వచ్చి, దాదాపుగా దేవదాస్ అనే సినిమా గురించి ప్రేక్షకులు, సినీ పరిశ్రమ మర్చిపోతున్న తరుణంలో మరో సక్సెస్ మీట్ పెట్టారు. థియేటర్లో సినిమా లేదు, దాని గురించి ఊసులేదు.. అయినా సరే `మా సినిమా చూడిండి… వసూళ్లు బాగున్నాయి` అని చెప్పుకోవడం చూస్తే విచిత్రం అనిపిస్తోంది. అయిపోయిన పెళ్లికి బాజాలేంటి? అన్నట్టు.. మర్చిపోయిన సినిమా గురించి పబ్లిసిటీ ఏమిటి? అంటూ… ఇండ్రస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. అయితే ఈ ప్రెస్ మీట్ వెనుక అశ్వనీదత్ బలవతం ఎక్కువగా ఉందని టాక్. ఈ సినిమా వల్ల బయ్యర్లు నష్టపోయారని, వసూళ్లు అనుకున్నంత రాలేదని ప్రచారం జరుగుతోంది. దాన్ని తిప్పి కొట్టడానికే … సినిమాకు ఎలాంటి ఉపయోగం లేకపోయినా ఈ ప్రెస్ మీట్ నిర్వహించారని తెలుస్తోంది. అశ్వనీదత్‌పై గౌరవంతోనే తమకు ఇష్టం లేకపోయినా నాగ్, నాని ఈ కార్యక్రమానికి వచ్చారని సన్నిహితులు చెబుతున్నారు.