99 టీవీ.. ఒకప్పుడు.. ఈ పేరుతో ఓ చానల్ ఉందని చాలా మందికి తెలియదు. కానీ అది జనసేన పార్టీకి.. పవన్ కల్యాణ్‌కు… మౌత్‌పీస్‌గా మారిన తర్వాత మాత్రం.. జనసేనకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్స్ కావాలాన్నా.. మొదట అదే టీవీ చానల్లో వచ్చేవి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనకు మీడియా మద్దతు పరిమితంగా ఉందని భావించిన పవన్… పార్టీ తరపున కొన్ని చానళ్లు ఉండాలని భావించారు. కమ్యూనిస్టు పార్టీ చేతిలో పూర్తిగా నలిగిపోయిన 99 టీవీని.. జనసేన కీలక నేత తోట చంద్రశేఖర్ కొనుగోలు చేశారు. ఆ మరుక్షణం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాన్ని ఓన్ చేసుకున్నారు. 99 టీవీకి టీఆర్పీలు ఎలా పెంచాలో.. సోషల్ మీడియాలో సూచనలు చేశారు. జనసైనికులందరూ.. అన్ని టీవీలను బ్యాన్ చేసి… కేవలం 99 టీవీని మాత్రమే చూడాలని ప్రచారం చేశారు. ఇప్పటికీ… అదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు. కానీ..బార్క్ ప్రకటించే ఎలక్ట్రానిక్ చానళ్ల రేటింగ్‌లో ఎప్పుడూ… కింద నుంచి మొదటి ప్లేస్‌లో అంటే… చివరి ప్లేస్లోనే ఉంటోంది. ఒక్కటంటే.. ఒక్క సారి కూడా.. తన స్థానాన్ని మెరుగు పరుచుకోలేకపోయింది.
99 టీవీ తోట చంద్రశేఖర్ చేతికి వచ్చిన తర్వాత… పవన్ కల్యాణ్ దానికో బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. తన క్రేజ్‌ను ఇతర చానళ్లు వాడుకోవడం ఏమిటని అనుకున్నారేమో కానీ.. కొన్ని కీలక సందర్భాల్లో… ఎలాంటి సమాచారాన్ని అయినా 99 టీవీకి మాత్రమే ఇవ్వడం ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో జనసేన తరపున ఏదైనా తెలుసుకోవాలన్నా… 99టీవీని చూసి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక సార్లు పార్టీ మీటింగుల్లో.. 99 టీవీలోగోను మాత్రమే దగ్గర ఉంచి.. మిగతా చానళ్లందరూ దూరంగా వెళ్లి జూమ్ చేసుకోవాలని.. నేరుగా పవన్ కల్యాణ్… ఆదేశించిన దృశ్యాలు కూడా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతగా 99 టీవీని పవన్ కల్యాణ్‌తో పాటు.. జనసైనికులు కూడా ప్రమోట్ చేసినా… ఆ చానల్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకు మీడియా విపరీతమైన ప్రచారం ఇచ్చింది. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టే దగ్గర్నుంచి మళ్లీ ఇంట్లోకి వెళ్లే వరకూ లైవ్ కవరేజీలతో హడావుడి చేసింది. కానీ పవన్ కల్యాణ్.. తన ఇమేజ్ను అటు పాజిటివ్‌గా ఇటు.. నెగెటివ్‌గా వాడుకుని టీఆర్పీ పంట పండించుకుంటున్నారని… ఫీలైపోయి… మీడియాపై యుద్ధం ప్రకటించారు. నేరుగా మీడియా యజమానులతోనే గొడవ పెట్టుకున్నారు. ఫలితంగా.. ముఖ్యమైన సందర్భాల్లో ఇతర చానళ్లు… అంతంతమాత్రంగానే కవరేజీ ఇస్తున్నాయి. రాజమండ్రి కవాతును నెంబర్ వన్ చానల్ లైట్ తీసుకుంది. నిజానికి సోషల్ మీడియాలో టీవీ నైన్, ఏబీఎన్‌లను డిస్ లైక్ చేద్దామని.. ఆ చానళ్లను అసలు బ్లాక్ లిస్ట్‌లో పెడదామన్న జనసైనికుల పోస్టులకు లక్షల్లో షేర్లు వచ్చాయ. కానీ ఎవరూ ఆచరించలేదని.. ఆ చానళ్లకు వస్తున్న రేటింగ్స్‌తో తేలిపోతోంది. ఎప్పటికప్పుడు ఆ చానళ్లు తమ స్థానాలను మెరుగుపరుచుకుంటూనే ఉన్నాయి. కానీ పవన్ బ్రాండ్ 99 టీవీ మాత్రం… దిగజారిపోతోంది.