“కేరళకు వరదలు వచ్చినప్పుడు.. అందరూ స్పందించారు. కానీ సిక్కోలుకు కష్టం వచ్చినప్పుడు ఒక్కరూ స్పందించడం లేదు..” ఇది మొదటిగా ఫిల్మ్ స్టార్.. ఆ తర్వాత రాజకీయ నాయకుడు అయిన… జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తం చేసిన ఆవేదన. ఈ విషయంలో మిగతా ప్రపంచం సంగతేమో కానీ… టాలీవుడ్ పరిస్థితినే విశ్లేషిస్తే.. పవన్ ఆవేదన.. వంద శాతం నిజం. ఎక్కడిదాకో ఎందుకు… టాలీవుడ్‌లో యాభై శాతం వాటా మాదేనని చెప్పుకునే మెగా కుటుంబం కూడా ఈ జాబితాలో ఉంది. వరుణ్ తేజ్ మాత్రం రూ. 5 లక్షలు ప్రకటించారు. ఇంకెవరూ.. కనీసం … తమ కన్సర్న్‌ను కూడా… వ్యక్తం చేయలేదు. నందమూరి కుటుంబం, విజయ్ దేవరకొండ, నిఖిల్, సంపూర్ణేష్ బాబు మాత్రం.. తమ వంతుగా స్పందించారు.
రాష్ట్రం కాని రాష్ట్రం కేరళలో వరదలు వచ్చినప్పుడు.. అక్కడ మల్లూ అర్జున్‌గా తనకు ఉన్న క్రేజ్‌కు తగ్గట్లుగా.. రూ. పాతిక లక్షల రూపాయలు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి రూ. 25 లక్షలు, రామ్ చరణ్ భార్య ఉపాసన రూ. 10 లక్షల విలువైన మెడిసిన్స్ పంపించారు. ఇక… ఆర్టిస్టులందరికీ ప్రాతినిధ్యం వహించే..మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా సమావేశమై.. రూ. 10 లక్షల సాయం చేస్తున్నట్లు మీడియా ముందు గొప్పలు పోయింది. సాయం చేయడాన్ని అందరూ అభినందించారు. కానీ మరి సొంత రాష్ట్రంలో.. అదీ తమకు కలెక్షన్ల వర్షం కురిపించిన జిల్లాల్లో ఉత్పాతం వస్తే.. వీళ్ల నోళ్లెందుకు లెగవడం లేదు..? చెక్కుబుక్కులు ఎందుకు కదలడం లేదు..?. మొన్నామధ్య నంది అవార్డుల వివాదం వస్తే… ప్రభుత్వంపై విరుచుకుపడిన మెగా ఫ్యామిలీ ..టాలీవుడ్ అంటే.. 50 శాతం మెగా ఫ్యామిలీనేని ఘనంగా ప్రకటించారు. కానీ ఒక్కరు మాత్రమే ముందుకొచ్చారు. ఇక అక్కనేని, ఘట్టమనేని ఫ్యామీలీలు కనీసం… అటు వైపు కూడా చూసినట్లు లేవు. సిక్కోలు.. పరాయి రాష్ట్రంగా వారు భావిస్తున్నట్లు ఉన్నారు.
తలుచుకుంటే.. సినిమా ఇండస్ట్రీని ఏక తాటిపై తీసుకురాగల శక్తి.. పవన్ కల్యాణ్‌కు ఉంది. దాన్ని గతంలో.. శ్రీరెడ్డి అనే మహిళ.. వివాదంలో పవన్ కల్యాణ్ నిరూపించారు కూడా. మరి ఉద్దానం కోసం.. .. అక్కడి ప్రజలకు తానున్నానని చెప్పిన.. పవన్ కల్యాణ్.. ఎందుకు సినిమా ఇండస్ట్రీని మొత్తం కార్యోన్ముఖుల్ని చేయరు…?. పవన్ కల్యాణ్ చేయకపోయినా… ప్రజల కలెక్షన్లే మార్కెట్ గా చేసుకుని కోట్లుకు పడగలెత్తిన స్టార్లు, టెక్నిషియన్లు ఎందుకు స్పందించరు..? సిక్కోలు మనది కాదా..? అక్కడి ప్రజలు తెలుగు సినిమాలు చూడరా..?