టిట్లి తుపాను ఉద్దానం ప్రాంతాన్ని అల్లకలోల్లం చేయగానే కొంత మంది సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని కార్పొరేట్ సంస్థలు ప్రకటించారు. ముఖ్యమంమత్రి కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ రూ. 66 లక్షల చెక్కును తీసుకొచ్చి ముఖ్యమంత్రికి అందించింది. వైసీపీ తరపున రూ. కోటి సాయం చేస్తున్నట్లు… ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అయితే.. మిగతా అందరూ సాయం చేయడానికి .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయం చేయాడనికి హస్తిమశకాంతరం తేడా ఉంది. అదేమిటంటే.. మిగిలిన వాళ్లంతా.. ముఖ్యమంత్రి సహాయనిధికి నిధులు ట్రాన్స్‌ఫర్ చేసి.. ఆ ప్రకటన చేశారు. కానీ వైసీపీ మాత్రం… రూ. కోటి ఇస్తామని చెప్పింది.
వైసీపీ తరపున ప్రకటించడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరనే ప్రశ్న వస్తుంది. సహజమే.. కానీ.. ఆయన ప్రకటనను జగన్ మీడియా చాలు ఉద్ధృతంగా ప్రసారం చేసింది. బ్రేకింగులు వేసి.. హంగామా చేసింది. అంటే.. ఆ ప్రకటన పార్టీ పరంగా చేసినట్లుగానే భావించాలి. అందుకే ఇలా ప్రకటించగానే.. ఇలా ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ రూ. కోటి సాయం ప్రకటన చేసి.. ఐదు రోజులు గడిచిపోయింది. కానీ వైసీపీ తరపు నుంచి ఈ సాయం… ముఖ్యమంత్రి సహాయనిధికి అందలేదు. పోనీ.. ప్రభుత్వానికి ఇష్టం లేదు కాబట్టి.. తామే బాధితులకు సాయం చేస్తారని అనుకుంటే.. అలాంటి ప్రయత్నమే జరగడం లేదు. అలా చేస్తే.. సాక్షి పత్రికలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేవారు. చేసుకోవడం లేదంటే.. చేయడం లేదనే. మరి ఆ రూ. కోటి ఎప్పుడిస్తారు..?
నిజానికి వైసీపీ తరపున… రూ. కోటి సాయం ప్రకటన ఇదే మొదటి సారి కాదు. కేరళకు కూడా.. రూ. కోటి సాయం జగన్ ప్రకటించారు. త్వరలో అందిస్తామన్నారు. కానీ ఇంత వరకూ ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే.. గొప్పగా.. పబ్లిసిటీ చేసుకుని ఉండేవాళ్లు. అయితే… ఆ పార్టీకి చెందిన ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాత్రం.. తన కంపెనీ తరపున కేరళకు రూ. కోటి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు.. కేరళకు వెళ్లి సీఎంకు ఇచ్చి వచ్చారు. దానికి ప్రతిగా కృతజ్ఞత లేఖలు కూడా అందుకున్నారు. ఆ విషయాన్ని మీడియా ముందు చెప్పుకున్నారు. కానీ .. జగన్ చేసిన సాయం మాత్రం బయటకు రాలేదు. తమ పార్టీ వాళ్లే కాబట్టి… వాళ్లు చేసినా..నేను చేసిన ఒకటే అనుకున్నారా..?. నిన్నటికి నిన్న ఆంధ్రజ్యోతి కూడా.. ఉద్యోగుల ఒక రోజు శాలరీ.. అంతకు అంత కలిపి… తాను.. కేరళ సీఎం రిలీఫ్ పండ్‌కు పంపారు. దానికి బదులుగా వచ్చిన కృతజ్ఞతలేఖను గొప్పగా చూపించుకున్నారు కూడా. కానీ.. జగన్ మాత్రం.. ఆ విషయంలో సైలెంట్‌గా ఉన్నారు.
ఇంకా ముందుకు వెళ్తే… విశాఖను హుదూద్ కుదిపేసినప్పుడు… జగన్ రూ. 50 లక్షల సాయం ప్రకటించారు. ప్రభుత్వానికి ఇవ్వబోమని.. వైఎస్ఆర్ ఫౌండేషన్ పేరుతో… ఖర్చు పెడతామని… పత్రికలో ప్రకటించి.. పాఠకుల దగ్గర్నుంచి విరాళాలు సేకరించారు. ఇలానే.. అప్పట్లో మరో ప్రముఖ దినపత్రిక కూడా.. సేకరించి.. మత్య్సకారులకు ఇళ్లకు కట్టించింది. కానీ జగన్ ప్రకటించిన ఆ రూ. 50 లక్షలు… సేకరించిన విరాళాలను ఏ విధంగా ప్రజలకు సాయం రూపంలో అందించారో సాక్షి పత్రిక బయటపెట్టలేదు. దీని ప్రకారం చూస్తే.. బాధితులకు సాయం పేరుతో ప్రకటనలకే జగన్ పరిమితం .. అసలు సాయం మాత్రం చేయడం లేదని అర్థం. గట్టిగా అడిగితే.. వాటర్ ప్యాకెట్లు.. పంచాం అంటారేమో..?