నాస్తికులు – ఆస్తికులు గొడవ ఎప్పుడూ ఉండేదే. దేవుడు ఉన్నాడని కొంతమంది, ఆ పేరు చెప్పుకుని భక్తి ని అమ్ముకుంటున్నారని కొంతమంది ఎప్పుడూ వాదించుకుంటూనే వచ్చారు. దేవుడు ఉన్నాడని చెప్పడానికి సాక్ష్యాలు ఎలాలేవో, లేడు.. అని నిరూపించడానికి ఆధారాలూ అలానే లేవు. కాబట్టి ఈ గొడవ అలా కొనసాగుతూనే ఉంటుంది. అసలు దేవుడి పేరు చెప్పుకుని జనాల్ని ఎలా మోసం చేస్తున్నారు? ఆ ముసుగులో మోసగాళ్లు కూడా దర్జాగా ఎలా స్వామీలుగా చలామణీ అయిపోతున్నారు. ఈ పాయింట్‌పై చాలా సినిమాలొచ్చాయి. ఆ జాబితాలో `సుబ్రహ్మణపురం` కూడా చేరిపోతుంది. సుమంత్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. టీజర్ విడుదలైంది. అది చూస్తుంటే… `కార్తికేయ` సినిమా లీలగా గుర్తుకురావడం సహజం. కార్తికేయలా ఇది కూడా ఓ గుడి నేపథ్యంలో సాగుతుంది. గుడి చుట్టూ కొన్ని అనూహ్యమైన సంఘటనలు, హత్యలు జరుగుతుంటాయి. దేవుడ్ని, భక్తుల్ని, బాబాల్ని ఎదురించి.. కథానాయకుడు ఎలాంటి పరిశోధన చేశాడన్నది కథ. కాన్సెప్ట్ బేస్డ్ సినిమా కాబట్టి… సరిగ్గా తీస్తే.. మెప్పించే అవకాశాలున్నాయి. `మళ్లీ రావా`తో ఓ హిట్టు అందుకున్న సుమంత్‌కి దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సాంకేతికంగా గొప్పగా లేకపోయినా… టీజర్ మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.