జనసేన అధినేత పవన్ కల్యాణ్… టిట్లి తుపాను బాధిత ప్రాంతాల్లో రెండో రోజు కొన్ని గ్రామల్లో పర్యటించారు. ముఖ్యంగా కరెంట్ రాని గ్రామాలకు వెళ్లారు. అక్కడ యువత ఆవేశాన్ని తన వీడియోల్లో బంధించారు. ట్విట్టర్లో పెట్టి.. ప్రభుత్వం పని చేయడం లేదని… ప్రపంచానికి చాటానని సంతోషపడ్డారు. అదే సమయంలో.. అక్కడ జరిగిన విలయాన్ని కూడా… తన ఫోటోల్లో పెట్టారు. అది కనీవినీ ఎరుగని విలయం. ఒక్కటంటే.. ఒక్క కరెంట్ పోల్ సహా…విద్యుత్ వ్యవస్థకు సంబంధించి ఏ ఒక్క అవశేషం మిగలని.. పనికి రాని పరిస్థితి. అలాంటి… పరిస్థితుల్లోనూ ప్రభుత్వం.. కోస్తా జిల్లాల నుంచి దాదాపుగా ఏడు వేల మంది విద్యుత్ సిబ్బందిని ఉద్దానంకు తరలించింది.
టిట్లీ తుపాను దెబ్బకు… ఒక్క కరెంట్ స్తంభం కూడా మిగల్లేదు. ట్రాన్స్ ఫార్మర్లు మొత్తం గాలిలోకి లేచిపోయాయి. ఇరవై-ముఫై సంవత్సరాల నుండి వేసుకున్న విద్యుత్ వ్యవస్థ మొత్తం టిట్లీ దెబ్బకు కకావికలం అయిపోయింది. 30 వేల కరెంటు స్థంబాలు పడిపోయాయి.ఎక్కడ చూసినా నేలకూలిన, వాలిపోయిన విద్యుత్తు స్తంభాలు… ఊగులాడుతున్న… నేలపై దొర్లాడుతున్న వైర్లు.. ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 33 కేవీ, 11కేవీ, లోటెన్షన్ వెరసి 23వేల వరకు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. 33 కేవీ వైర్లు 1,358 కిలోమీటర్లు, లోటెన్షన్ వైర్లు 5,316 కిలోమీటర్లు, 11 కేవీ వైర్లు 3,102.7 కిలోమీటర్ల మేరకు తెగిపోయాయి. వీటన్నింటినీ సరిచేసి అన్ని ఆవాస ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా పునరుద్ధరించడానికి కనీసం రెండు నెలలు పడుతుంది. కానీ చంద్రబాబు ఏడు వేల మంది సిబ్బందిని ఉద్దానంకు తరలించారు. ఇంటికి కరెంట్ రావాలంటే ముందు 33కేవీ లైన్లు, తర్వాత 11కేవీ లైన్లు సరిచెయ్యాలి. ట్రాన్స్ఫార్మర్ పోల్స్ కూడా పడిపోయాయి. .. అవి నిలబెట్టాలి. అప్పుడు ఎల్టీ లైన్లు సరి అవుతాయి. అవి అన్నీ సరి చెయ్యాలంటే ఏదో ఒకటి రెండు రోజుల్లో సినిమాలో వేసిన సెట్‌లా అయిపోదు. ఇప్పటికే దాదాపుగా 85 శాతం కరెంటు ఇస్తున్నారు. మిగిలిన చోట్ల పనులు జరుగుతున్నాయి.
అవి కూడా మరో, నాలుగు అయిదు రోజులలో పూర్తవుతాయి. కానీ రాజకీయ అవసరాల కోసం.. కష్టపడి పని చేసే వారిని, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. పవన్ ఆరు రోజులైనా పునరుద్ధరించలేదని ఆరోపణలు చేస్తున్నారు. 7వేల మంది సిబ్బంది రాత్రనకా, పగలనకా దసరా లాంటి పెద్ద పండగలను, కుటుంబాలను కూడా వదిలి కష్టపడి పనిచేస్తున్నారు. విద్యుత్ వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వీరి కష్టాన్ని తగ్గించేలా.. కించ పరిచేలా.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు పనేమీ చేయడం లేదని.. చెప్పుకోవడానికి ఆయన విమర్శలు బాగుంటాయి కానీ.. అది.. విద్యుత్ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. అది రాజకీయనేతలకు అసలు మంచిది కాదు. కొత్త తరం రాజకీయం తీసుకొస్తానంటున్న పవన్ కల్యాణ్‌కు అసలు మంచిది కాదు…!
———-సుభాష్