బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా… వ్యవహరిస్తున్న ఆర్.కృష్ణయ్య గత ఎన్నికల ముందు చంద్రబాబు దృష్టిలో పడ్డారు. ఆంధ్రా పార్టీ పేరుతో… టీడీపీపై దాడి చేస్తున్న టీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి బీసీ నినాదాన్ని తీసుకొచ్చి.. ఆర్.కృష్ణయ్యను పార్టీలోకి తీసుకుని.. ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆర్.కృష్ణయ్యను ఎల్బీనగర్ నుంచి గెలిపించుకోవడానికే టీడీపీ నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆర్.కృష్ణయ్య .. తాను స్వతహాగా ముఖ్యమంత్రి అభ్యర్థిని అన్నట్లు టీడీపీనే ధిక్కరించడం ప్రారంభించారు. ఆపరేషన్ ఆకర్ష్‌లో అందర్నీ ఆకర్షించిన టీఆర్ఎస్… ఆర్.కృష్ణయ్య వైపు అసలు చూడను కూడా చూడలేదు.
అయితే ఇప్పుడీయనకు అసలు సీన్ తెలిసొచ్చింది. కనీసం ఎల్బీనగర్ సీటు అయినా ఎవరు ఇస్తారా..? అని ఎదురు చూస్తున్నారు. టీడీపీ మళ్లీ పిలిచి సీటు ఇస్తుందనుకున్నారు కానీ.. ఆ పార్టీ అసలు పట్టించుకోలేదు. ఆ విషయాన్ని ఆర్.కృష్ణయ్యే చెప్పుకున్నారు. కూటమి సీట్ల చర్చల్లో భాగంగా… కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ఇచ్చిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేదన్నారు. బీసీల డిమాండ్ల పేరుతో ఆయన జానారెడ్డితో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎల్బీనగర్ సీటు కోసం లాబీయింగ్ చేసుకున్నారు. మహాకూటమిలోకి కాంగ్రెస్ తనను ఆహ్వానించిందని ఎల్బీనగర్ సీటు కోరుతున్నట్లు ఆయన చెప్పుకుటున్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఎల్బీనగర్ ఇచ్చే పరిస్థితిలో లేదు. అక్కడ సుధీర్ రెడ్డి ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పార్టీలో చేరితే ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పాపం.. ఆర్.కృష్ణయ్య.. ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయి నుంచి అసెంబ్లీ అభ్యర్థిత్వం కోసం… పాకులాడే పరిస్థితికి చేరిపోయారు. రాజకీయం ఒంటబట్టకపోతే అంతేనేమో..?