కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ … తెలంగాణ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై డైరక్ట్ ఎటాక్ చేశారు. నరేంద్రమోడీని చౌకిదార్ కాదు చోర్ అని తేల్చి చెప్పేశారు. కేసీఆర్ వైఫల్యాలపై సూటిగా విమర్శలు గుప్పించారు కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారని.. రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? ..డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు.. కట్టించారా? ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు.. ఇచ్చారా? అంటూ సీరియల్ గా ప్రశల వర్షం కురిపించారు. తెలంగాణలో పంటలకు మద్దతు ధర రావడం లేదని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల కష్టాలు తీరుస్తామన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పంటలకు మద్దతు ధర పెంచుతామన్నారు. గతంలో రూ. 70 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన సంగతిని గుర్తు చేశారు. మరోసారి రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతి కుటుంబానికి 15 లక్షలు డిపాజిట్ చేస్తామన్నారని.. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. కానీ ఎక్కడా ఇవ్వలేదన్నారు. దేశానికి కాపాలాదారుడిని అని మోదీ చెబుతారు కానీ నిరవ్ మోడీ, చోక్సీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వారికే కపలాదారు అని మండిపడ్డారు. వారిని మోదీ దేశం దాటించారన్నారు రాఫేల్ పేరుతో తన మిత్రుడు అనిల్ అంబానీకి.. రూ.30 వేల కోట్లు దోచి పెట్టారన్నారు. హెచ్ఏఎల్ను దెబ్బతీసిన అనిల్ అంబానీకి మోదీ మేలు చేకూర్చి దేశద్రోహానికి పాల్పడ్డారన్నారు. రాష్ట్రాల మధ్య, వర్గాలమధ్య చిచ్చు పెట్టి… ఒకరిని మరొకరిపై ఉసిగొల్పుతారని… మనందరం ఏకమై ఇలాంటివారిని ఓడించాలా వద్దా? అని రాహుల్ ప్రశ్నించారు.
తెలంగాణలో కేసీఆర్, ఢిల్లీలో మోదీ ఓడిపోతారని … ఇక్కడా, అక్కడా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వాలేనన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆదివాసీల భూములు వెనక్కి ఇస్తామన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటామని ప్రకటించారు. రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కేసీఆర్ మాటలు చెప్పారని.. కలలు చూపించారని మండిపడ్డారు.
ఇప్పటికే ఐదేళ్లు వృధా అయ్యాయని కేసీఆర్ సీఎం అవడంతోనే అరాచకాలు, అవినీతి మొదలుపెట్టారని మండిపడ్డారు. ప్రజల కలలు సాకారం కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగంలో ఎక్కడా తడబాటు లేకుండా..నేరుగా.. మోడీ, కేసీఆర్ ను ధాటిగా ఎటాక్ చేయడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది.