`నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా` తరవాత బాగా గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్. ఈ గ్యాప్‌లో చాలా కథలు విన్నా, కొంతమంది దర్శకులకు ఓకే చెప్పినా… ప్రాజెక్ట్ ఎక్కించడానికి మాత్రం సాహసించలేకపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న తపనతో ఉన్న బన్నీ.. సేఫ్ ప్రాజెక్ట్ చేయడానికే మొగ్గు చూపుతున్నాడు. `అరవింద సమేత వీర రాఘవ` కంటే ముందే త్రివిక్రమ్‌పై కర్చీఫ్ వేసిన బన్నీ – ఆ సినిమాకి మంచి వసూళ్లు వస్తుండడంతో కాంబినేషన్‌కి ఖాయం చేసేశాడు. ఈ కాంబినేషన్లో ఇది మూడో సినిమా. డిసెంబరు నుంచి చిత్రీకరణ మొదలుకానుంది. త్రివిక్రమ్ సొంత బ్యానర్ లాంటి హారిక హాసిని సంస్థలోనే ఈ సినిమా కూడా ఉండబోతోంది. నిజానికి గీతా ఆర్ట్స్‌లోనే ఈ సినిమా చేద్దామనుకున్నారు. డి.వి.వి దానయ్య కూడా రెడీగా ఉన్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమానీ హారికలోనే చేయాలని నిర్ణయించుకున్నార్ట. దాంతో బన్నీ కి నో చెప్పే ఛాన్స్ లేకుండా పోయింది. ప్రస్తుతం `అరవింద సమేత` విజయానందంలో ఉన్నాడు త్రివిక్రమ్. లైన్ రెడీగానే ఉన్నప్పటికీ.. దాన్ని స్క్రిప్టు రూపంలో తీసుకురావాలి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి హిట్ అయ్యింది. సన్నాఫ్ సత్యమూర్తి యావరేజ్ తో సరిపెట్టుకుంది. హ్యాట్రిక్ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో?