తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలి ప్రచార కార్యక్రమం అయిపోయింది. అయితే, త్వరలోనే ఆయన మళ్లీ తెలంగాణలో పర్యటిస్తారు. మరో రెండు మూడు రోజుల్లో ఆ షెడ్యూల్ ని కూడా ఏఐసీసీ ప్రకటించనుంది. సోనియా గాంధీ కూడా కనీసం ఐదు సభలకు వస్తారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా ఇక్కడ పర్యటించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందన్నది ఆ పార్టీ అంచనా. అయితే, రాబోయే ఎన్నికల్లో మహా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోంది. ఓపక్క కూటమి పార్టీల మధ్య పొత్తులు కూడా దాదాపు ఖరారు అయిపోయిన తరువాత రాష్ట్రానికి వచ్చిన రాహుల్… భాగస్వామ్య పక్షాల నేతల్ని కలవకుండానే వెళ్లిపోయారు..!
సీట్ల సర్దుబాటుపై ఒక స్పష్టత వచ్చిన తరువాత మహా కూటమి నేతలతో రాహుల్ భేటీ ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. త్వరలోనే సీట్ల సంఖ్యపై స్పష్టత రాగానే… వచ్చే పర్యటనలో రాహుల్ తో కూటమి నేతలు కలిసే అవకాశం ఉందంటున్నారు. సీట్ల కేటాయింపులు ముగిసిన వెంటనే మహా కూటమి పక్షాలన్నీ కలిసి ఒక భారీ బహిరంగ ఏర్పాటు చేస్తాయని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సభలో భాగస్వామ్య పార్టీలకు చెందిన జాతీయ అధ్యక్షులందరూ ఒకే వేదిక మీదకి తీసుకుని రావాలనే ఆలోచనతో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీజేయస్ అధ్యక్షుడు కోదండరామ్, వీరితోపాటు సీపీఐ జాతీయ నేతల్ని కూడా భారీ బహిరంగ సభకు రప్పించే ఆలోచన ఉన్నట్టు వినిపిస్తోంది.
భాగస్వామ్య పక్షాలు కాబట్టి, అన్ని పార్టీల నేతలు ఒక వేదిక మీదికి రావడం అనేది సహజంగా జరిగేదే. కాకపోతే, చంద్రబాబు, రాహుల్ గాంధీ ఒకే వేదిక మీదికి అనేది కాస్త ఆసక్తికరమైన అంశమే కదా. గతంలో కర్ణాటకలో కూడా ఒకే వేదిక మీదకి వచ్చినప్పటికీ… అక్కడ ఇతర పార్టీల నేతలు చాలామంది ఉన్నారు. అప్పటికి పొత్తుల్లాంటివేవీ లేవు. తెలంగాణలో మహా కూటమి దగ్గరకి వచ్చేసరికి… ఆ సభలో ఫోకస్ అంతా కచ్చితంగా చంద్రబాబు, రాహుల్ మీద మాత్రమే ఉంటుంది. ఇలాంటి సభకు చంద్రబాబు నాయుడు వస్తారా అనే సందేహం కూడా కొంతమందిలో ఉంది. అయితే, తెలంగాణ ఎన్నికల్లో పర్యటించేందుకు అవసరం అనుకుంటే తాను తప్పకుండా వస్తానని చంద్రబాబు అన్నారని రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ చాలా సందర్భాల్లో చెప్పారు. మహా కూటమి మేనిఫెస్టోని కూడా అదే సభలో విడుదల చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి, చంద్రబాబు కూడా వస్తారనే ధీమాతో టీ టీడీపీ శ్రేణులున్నాయి. ఈ సభ ఎప్పుడు ఉంటుందనేది కూడా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.