ఐటీ దాడుల్లో దొరికాయని… పత్రికల్లో వచ్చాయని.. బోలెడంత బురద కోటులో వేసుకుని ఢిల్లీ నుంచి శుక్రవారం ఉదయమే… విజయవాడ చేరుకున్న జీవీఎల్ నరసింహారావు.. అక్కడ సీఎం రమేష్, లోకేష్ , చంద్రబాబులపై పూయగలిగినంత పూశారు. ఏదైనా ఒక ఆధారం చూపించడం అన్న మీడియాకు.. వాళ్ల మీద కూడా.. కాసింత వేశారు. మీలాంటి మీడియా ఉన్న దౌర్భాగ్య ఆంధ్రప్రదేశ్ అని సర్దుకుని వెళ్లిపోయారు. అయితే… ఇంకా మిగిలిపోయిందేమో.. నేరుగా… హైదరాబాద్ వెళ్లారు. అక్కడ రేవంత్ రెడ్డిపై మిగిలిపోయిన బురద చల్లారు. ఆయన ఇంట్లో కూడా ఐటీ దాడులు జరిగాయి కదా..! ఇదిగో ఆయన కూడా వందల కోట్లు అక్రమలావాదేవీలు అనే దగ్గర్నుంచి ప్రారంభించి.. భూకబ్జాదారుడు. సెటిల్మెంట్లు చేసే రౌడీ అంటూ.. చెలరేగిపోయారు. అంతేనా.. తన వాదన గొప్పగా ఉందని ఊహించుకున్నారేమో కానీ.. హెచ్ఎంటీవీ అనే చానల్లో చర్చకు వెళ్లారు. అప్పుడే అసలు సినిమా జరిగింది.
ఆ షో హోస్ట్ చేస్తున్న శ్రీనివాసరెడ్డి… రేవంత్ రెడ్డికి లైన్ కలిపారు. రేవంత్ రెడ్డి సింపుల్‌గా ఒక్క ప్రశ్న అడిగారు. మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలేమిటి..? అని.. దానికి జీవీఎల్ పత్రికల్లో వచ్చిందే చెప్పాను అన్నారు. ఐటీ వాళ్లు పత్రాలిచ్చారు పత్రికలకు అని కవర్ చేసుకుంటున్నారు. అదే ఐటీ వాళ్లు.. తమకు ఎలాంటి పత్రాలు బయటకు లీక్ చేయలేదని.. తనకు చెప్పాలని.. ఫేక్ పేపర్లు తీసుకుని వచ్చి మీడియా ముందు.. రాజకీయం చేస్తున్నావా అని రేవంజ్ జీవీఎల్‌ను సూటిగానే ప్రశ్నించారు. దానికి జీవీఎల్ మొత్తం మీడియామీదే తోసిపడేశారు. మీడియాలో వచ్చింది… ఆ మీడియాను నేను నమ్మాను… ఒకవేళ తప్పయితే.. మీడియాతో మాట్లాడుకోండి అనేశారు. ఆరోపణలు చేసింది నువ్వు కాబట్టి… 48 గంటల డెడ్ లైన్ పెడుతున్నారు. ఎలాంటి ఆధారాలైనా తెచ్చుకో… నా మీద ఆరోపణలు నిరూపించు.. ఎక్కడ చర్చకు రమ్మంటే అక్కడకు వస్తా.. అని రేవంత్ సవాల్ చేశారు. దానికి జీవీఎల్ సమాధానం.. ఇందులో చర్చించాల్సిందేముంది.. ఏమైనా ఉంటే.. ఐటీ అధికారులతో చర్చించుకో అని..!
కేంద్రంలో అధికారంలో ఉండి… అన్ని రాజ్యాంగ వ్యవస్థలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకుని కూడా.. తమకు ఇష్టం లేని నేతలపై… దాడులు చేయిస్తూ.. కూడా.. జీవీఎల్ ఆరోపణల్నే నమ్ముకుంటున్నారు. ఒక్క రూపాయి అవినీతికి ఆధారం చూపించమని.. సీఎం రమేష్.. మీసం మెలేసి అడిగినా…. రేవంత్ రెడ్డి తొడకొట్టినా… జీవీఎల్ ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. రాజకీయంలో ఉన్నారు కాబట్టి.. బురద జేబులో పెట్టుకొచ్చి.. ఇష్టం లేని వారందరిపై చల్లడం.. తన జన్మహక్కు అన్నట్లుగా భావిస్తున్నారు. ఈ విషయంలో పోతోంది బీజేపీ పరువే. అయినా… అలాంటి ఒకటి ఉందని భావించేవారి ఆ ఫీలింగ్ ఉంటుంది. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనుకుంటే.. జీవీఎల్లా తనపై పడకుండా..”బురదహోళి”ని రోజూ జరుపుకోవచ్చు.