మంచు ఫ్యామిలీ రాజకీయాలకు కొంచెం దగ్గరగా కొంచెం దూరంగా వస్తూ ఉంది. మోహన్ బాబు అప్పుడప్పుడూ పొలిటికల్ పరంగా కొన్ని స్టేట్మెంట్లు విసురుతుంటారు. మంచు లక్ష్మికీ రాజకీయాలవైపు రావాలన్న కుతూహలం ఉంది. అయితే అనూహ్యంగా మంచు మనోజ్ ఇప్పుడు బయటపడిపోయాడు. సేవ – లక్ష్యం అంటూ కాస్త డొంకతిరుగుడుగా ఓ ట్వీట్ చేశాడు. అందులో `రాజకీయాలపై` తనకున్న ఆసక్తి వ్యక్తపరచకున్నా – దాదాపుగా పొలిటికల్ పరమైన స్టేట్ మెంటే అనుకోవొచ్చు.
“మన ప్రతీ లక్ష్యానికీ ఓ గోల్ ఉండాలి… ఆ గోల్ యెక్క లక్ష్యం మన చుట్టూ ఉండే ప్రజల్ని ఉద్దరించేలా ఉండాలి“ అంటూ ఓ సుదీర్ఘమైన లేఖ రాశాడు మనోజ్. దాని సారాంశం ఏమిటంటే…. మనోజ్ త్వరలో రాయలసీమ షిఫ్ట్ అవుతున్నాడట. తిరుపతిలో తనకు ప్రశాంతత దొరికిందని, అక్కడ ఉంటూ… రైతులకు, వాళ్ల పిల్లలకు సేవ చేస్తానని లేఖలో రాసుకొచ్చాడు. అంతేకాదు… తన సేవ కేవలం రాయలసీమకే పరిమితం కాదని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకూ సేవ చేస్తానని, అయితే ఇంతలో తన సినీ రాజకీయ జీవితంపై ఎవరూ ఎలాంటి తీర్మాణాలు చేయొద్దని కోరాడు. సినిమాలపై తనకున్న ప్రేమ, దాహం తగ్గదని సినిమాలు చేస్తూనే ఉంటానని అన్నాడు.
ఇదంతా చూస్తుంటే మనోజ్ త్వరలోనే ఏదో ఓ జెండా పట్టుకోవడం ఖాయంగా అనిపిస్తోంది. మంచు కుటుంబం కొన్నాళ్ల నుంచీ బీజేపీకి టచ్లో ఉంటోంది. మోడీ ప్రధాని అయ్యాక.. ఆయన్ని కలిసి వచ్చారు కూడా చూద్దాం.. మనోజ్ ప్రయాణం ఏ పార్టీవైపుకో.