తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… నియోజకవర్గానికి అరవై వేల మంది ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక కార్యాచరణ … 105 మంది అభ్యర్థులకు అందించారు. ప్రభుత్వ పరంగా.. లబ్దిపొందిన ప్రతి ఒక్కరి పేరు, ఆడ్రస్, ఫోన్ నెంబర్‌తో సహా.. పూర్తి వివరాలు అందించి… అందరితోనూ.. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ చేయించుకునేందుకు వందకు వంద శాతం ప్రయత్నించాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. సహించబోనని స్పష్టం చేశారు. చాలా మంది అభ్యర్థులు ప్రచారంలో అనుకున్నంత వేగం చూపించడం లేదని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొంత మంది అభ్యర్థులు… ప్రజల్లో వివాదాస్పదంగా మాట్లాడటాన్ని తప్పు పట్టారు. ప్రజల్లో మాట్లాడుతున్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు.
ప్రచార సామాగ్రి విషయంలో కేసీఆర్ మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రగతి నివేదన సభకు ముందు.. ఎమ్మెల్యేలందరికీ.. ఓ అట్టపెట్టేలో… ప్రచార సామాగ్రి ఇచ్చిన టీఆర్ఎస్ అధినేత.. ఆ తర్వాత నియోజకవర్గాలకు.. పార్టీ తరపున పంపిణీ చేయడం ప్రారంభించారు. అంతే కాదు.. అందిందా లేదా.. అన్న విషయాన్ని కూడా స్వయంగా ఫోన్ చేసి కనుక్కున్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలోనూ.. ప్రచార సామాగ్రిని గ్రామాల వరకూ చేర్చుకోవడంపై… ప్రత్యేకమైన సూచనలు చేశారు. ఎవరూ గీత దాటవద్దని.. ఎన్నికల కోడ్ ఉందనే సంగతిని గుర్తు చేసుకోవాలని సుతిమెత్తని హెచ్చిరకుల చేశారు. అంతే కాకుండా పాక్షిక మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసంతృప్తుల సమస్య అధికంగా ఉన్న కారణంగా ఆగిపోయిన ఖమ్మం, వరంగల్, కరీంగనర్ జిల్లాల్లో బహిరంగసభలను నెలాఖరులోనే నిర్వహించాలని నిర్ణయించారు. నియోజకవర్గ స్థాయి సభలను… వెంటనే ప్రారంభిస్తానని… నోటిఫికేషన్ వచ్చే లోపు 30 సభలు పూర్తి చేస్తానని కేసీఆర్ అభ్యర్థులు తెలిపారు.
పెండింగ్ లో ఉన్న పధ్నాలుగు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటిస్తారేమోనని ఆశావహులు ఆశ పడ్డారు. ఆ స్థానాలు లెక్కలో లేవన్నట్లు.. మిగతా నియోజకవర్గాలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి వాటిని లైట్ తీసుకోవడం.. ఆయా స్థానాలు ఆశిస్తున్న వారిని నిరాశపరిచింది. కనీసం.. ఇప్పటి వరకు పని చేసకోమని.. ఎవరికీ సూచనలు కూడా ఇవ్వకపోవడంతో.. కేసీఆర్ ఆలోచనలేమిటన్నదానిపై… వారు గందరగోళంలో పడ్డారు.