అసెంబ్లీ రద్దుకు ముందే సిట్టింగు ఎమ్మెల్యేల పనితీరు మీద ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూనే ఉండేవారు. దాదాపు ఓ అరడజను సర్వేలు చేయించిన తరువాతే ముందస్తుకు ఆయన సిద్ధమైన సంగతి తెలిసిందే. అంతేకాదు, వాటి ఆధారంగానే సిట్టింగులకు టిక్కెట్లు ప్రకటించారు. ఆ నివేదికల్నే అభ్యర్థుల పనితీరు కొలమానంగా చూస్తూ వచ్చారు. ఇక, ఇప్పుడు చేయిస్తున్న సర్వేలన్నింటిలోనూ తామే అఖండ మెజారీటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తేలుతోందని కేసీఆర్ భారీగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, ప్రకటించిన అభ్యర్థుల్లో కొంతమందిపై క్షేత్రస్థాయిలో అసంతృప్తి ఉందనీ, జాబితాలో కొన్ని మార్పులు తప్పవనే చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా రంగంలోకి దిగినట్టు సమాచారం..!
టిక్కెట్లు దక్కించుకుని, అసంతృప్తి వ్యక్తమౌతున్న అభ్యర్థుల విషయమై కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. అలాంటి అభ్యర్థులపై ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఆయా నియోజక వర్గాల్లో సర్వేలు నిర్వహించినట్టు ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఇప్పటికే వీరిపై ప్రభుత్వ వర్గాల ద్వారా తెప్పించుకున్న నివేదికలు, కేసీఆర్ చేయించుకున్న సర్వే ఫలితాలను పక్కన పెట్టి… కేటీఆర్ కొత్తగా ఓ బృందాన్ని రంగంలోకి దించారట! గ్రామాల వారీగా, పోలింగ్ బూత్ ల వారీగా, కులాల వారీగా, కుల సంఘాల ప్రాతిపదిక… వ్యతిరేకత వ్యక్తమౌతున్న అభ్యర్థిపై ఈ స్థాయిలో అభిప్రాయ సేకరణ చేస్తున్నారట. ఇప్పటికే ఇలా రెండు దఫాలుగా ఈ తరహాలో సర్వేలు నిర్వహించారనీ, ప్రస్తుతం మూడు దఫా సర్వే జరుగుతోందని తెలుస్తోంది.
వరుసగా మూడో సర్వేలో కూడా ఫలితాలు సరిగా లేని అభ్యర్థుల జాబితాను ప్రత్యేకంగా తయారు చేస్తున్నట్టు సమాచారం. అంటే, ప్రస్తుతం కేటీఆర్ చేయిస్తున్న సర్వేల్లో సరైన ఫలితాలు సాధించిన వారికి మాత్రమే నామినేషన్ వేసేందుకు పార్టీ నుంచి బీ ఫామ్స్ అందుతాయనీ, లేనివారికి అనుమానమే అనే టాక్ వినిపిస్తోంది. ఈ మూడో సర్వేలో కొద్ది వ్యతిరేకత వ్యక్తమై… స్థానికంగా లోటుపాట్లు సరిదిద్దుకునే అవకాశం ఉంటే, అలాంటి చర్యలపై కూడా కేటీఆర్ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు తెరాసలో ఇదే హాట్ టాపిక్ గా వినిపిస్తోంది.