త్రివిక్రమ్ మాటలే కాదు, స్పీచులు కూడా భలే బాగుంటాయి. అత్తారింటికి దారేది, సన్నాఫ్సత్యమూర్తి, అ.అ.. ఈసినిమాల సమయంలో త్రివిక్రమ్ ఇచ్చిన స్పీచులు అభిమానులు మళ్లీ మళ్లీ వింటుంటారు. ఓసారి సిరివెన్నెల గురించి మాట్లాడిన మాటలకైతే – యూ ట్యూబ్లో బోలెడన్ని హిట్స్ ఉన్నాయి. `అరవింద సమేత`కీ మాటల మాంత్రికుడు స్పీచులు దంచేస్తాడని అనుకున్నారు. అయితే… అలా అనుకున్నవాళ్లందరికీ షాక్ ఇచ్చాడు త్రివిక్రమ్. `అరవింద` ప్రీ రిలీజ్లో అస్సలు మాట్లాడలేదు. దానికి కారణాలు రెండు. అప్పటికే `అజ్ఞాతవాసి` అనే డిజాస్టర్ మోస్తున్నాడు త్రివిక్రమ్. `మాటలతో కాదు చేతలతో చూపించాలి` అన్న నిర్ణయానికి వచ్చి త్రివిక్రమ్ సైలెంట్ అయ్యి ఉండొచ్చు. మరోవైపు వేదికపై ఉన్నవాళ్లంతా హరికృష్ణని స్మరించుకుంటూ.. అక్కడి వాతావరణాన్ని కన్నీటి పర్యంతం చేశారు. అందుకే త్రివిక్రమ్ లాంటి వాడు కూడా అక్కడ మాటలు వెదుక్కున్నాడేమో అనిపించింది.
పోనీ సక్సెస్ మీట్లో త్రివిక్రమ్ తెగ మాట్లాడేస్తాడేమో అనుకున్నారు. కానీ అదీ తుస్సే అయ్యింది. రెండంటే రెండు ముక్కులు మాట్లాడి `మ.మ` అనిపించాడు త్రివిక్రమ్. హిట్టొచ్చి, త్రివిక్రమ్ గత చిత్రాల రికార్డులు బద్దలు కొడుతున్నా – త్రివిక్రమ్ మౌనాన్నే ఆశ్రయించడం అభిమానుల్ని నిరాశ పనిచేదే. బహుశా.. ఈ సినిమాకి వసూళ్లతో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కథలో కొత్తదనం లేదని, వేంపల్లి గంగాధర్ లాంటి రచయితల కథల్లో్ంచి కీలకమైన అంశాల్ని త్రివిక్రమ్ తెలివిగా దొంగిలించాడని ఎత్తి పొడుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ మళ్లీ సైలెంట్ అయిపోయాడేమో.