ఆన్ లైన్ మీడియా విశ్వరూపం చూపిస్తూండటంతో… ప్రింట్ మీడియా పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. పాశ్చాత్య దేశాల్లో ప్రఖ్యాత న్యూస్ మ్యాగజైన్లు, న్యూస్ పేపర్లు ఆన్ లైన్ ఎడిషన్లకే పరిమితమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ట్రెండ్ ప్రారంభమయింది. ఈనాడు కాంపౌండ్ నుంచి వచ్చి.. ఒకప్పుడు సర్క్యూలేషన్ లో సంచలనాలు సృష్టించిన సినిమా వారపత్రిక సితార, మ్యాగజైన్లు చతుర, విపుల …ఇప్పుడు ఫిజికల్ కాపీలు బయటకు రావడం లేదు. ఇలా చాలా మందికి ఆవేదనకు గురి చేసినా… మారుతున్న కాలం అని సర్దిచెప్పుకోక తప్పని పరిస్థితి. అయినప్పటికీ.. తెలంగాణలో కొత్త కొత్త దినపత్రికలు ప్రారంభమవుతున్నాయి. ఇవి చిన్నా చితకవి కాదు.. కాస్త పేరున్నవే.
ఈ నెల ఆరో తేదీనే … ప్రముఖ పారిశ్రామికవేత్త. వీ6 చానల్ యజమాని, టీఆర్ఎస్ నేత వివేక్ కుటుంబం ఆధ్వర్యంలో “వీ6 వెలుగు” మార్కెట్లోకి వచ్చింది. అరవై వేల సర్క్యూలేషన్తో… మంచి ప్రారంభమే ఈ పత్రిక అందుకందని.. మీడియా వర్గాలు చెబుతున్నాయి. క్వాలిటీ జర్నలిస్టులు.. పెన్ పవర్ ఉన్న వారిని వెదికి మరీ… చేర్చుకోవడంతో.. వెలుగుకు ఫస్ట్ ఇంప్రెషన్… నాట్ బ్యాడ్ అన్నట్లుగా వచ్చింది. తన వ్యాపార ప్రణాళికలతో.. ఈ పత్రికను.. తెలంగాణ ప్రజల చాయిస్గా మార్చాలని.. వివేక్.. ప్రయత్నిస్తున్నారు. తాను టీఆర్ఎస్లో ఉన్నా.. పరిస్థితులు మారి కాంగ్రెస్లో చేరినా సరే.. ఎక్కడా తన పత్రికలో రాజకీయ కోణం కనబడకూడదని… ఎడిటోరియల్ స్టాఫ్కు నేరుగా చెబుతున్నారంటున్నారు. దీంతో ఈ పత్రిక క్రెడిబులిటి సంపాదించుకుటుందని భావిస్తున్నారు.
ఇక కొత్తగా “ప్రజాపక్షం” పేరుతో నేడే ఓ పత్రిక మార్కెట్లోకి రాబోతోంది. ఇది సీపీఐ సొంత పత్రిక. గతంలో ఈ పార్టీకి విశాలాంధ్ర పత్రిక ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో విశాలాంధ్ర అంటే బాగోదని… “మన తెలంగాణ” అని పేరు మార్చి… భాగస్వామ్య ప్రయోగాలు చేశారు. సహజంగా కమ్యూనిస్టు ముద్ర కాబట్టి.. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వచ్చేసరికి.. కేసీఆర్ కన్నెర్ర చేశారు. ఫలితంగా.. “మన తెలంగాణ”ను సీపీఐ పోగొట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో… 99టీవీని నడపలేక చేతులెత్తే సమయంలో బేరం రావడంతో.. జనసేన నేత తోట చంద్రశేఖర్ కు అమ్మేశారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వనరులన్నింటినీ కూడగ్టటుకుని… పాత విశాలాంధ్ర టీంను మళ్లీ సమీకరించుకుని” ప్రజాపక్షం ” పత్రికను ప్రారంభిస్తున్నారు. మన తెలంగాణ నుంచి కేసీఆర్ ఆగ్రహంతో ఉద్వాసకు గురైన శ్రీనివాసరెడ్డి ప్రజాపక్షానికి ఎడిటర్ . సీపీఐకి నిబద్ధులైన చందాదారులు ఉంటారు కాబట్టి.. వారంతా ప్రజాపక్షానికి మళ్లే అవకాశం ఉంది.